ఏ దేశ భవిష్యత్​ను అయినా నిర్దేశించే శక్తి ఎగుమతులకు ఉంది : పీయుష్​ గోయల్

ఏ దేశ భవిష్యత్​ను అయినా నిర్దేశించే శక్తి ఎగుమతులకు ఉంది : పీయుష్​ గోయల్

న్యూఢిల్లీ: ఏ దేశ భవిష్యత్​ను అయినా నిర్దేశించే శక్తి ఎగుమతులకు ఉందని కేంద్ర వాణిజ్య, ఆహారభద్రతలశాఖల మంత్రి పీయుష్​ గోయల్​ అన్నారు. అన్ని రంగాల ఎగుమతులను పెంచేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. హైదరాబాద్​లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్​టీసీసీఐ) శుక్రవారం ‘ఇండియా ఎగుమతిదారులకు గ్లోబల్​ మార్కెట్లో అవకాశాలు’ అనే అంశంపై నిర్వహించిన చర్చాకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో మనదేశంలో 675 బిలియన్​ డాలర్ల ఎగుమతులను సాధించిందని, ఈ సంవత్సరం వీటి విలువను 750 బిలియన్​ డాలర్లకు (దాదాపు రూ.61 లక్షల కోట్లు) పెంచాలనే టార్గెట్​తో పనిచేస్తున్నామని చెప్పారు. ‘‘ఈ టార్గెట్​ను సాధించాలంటే తయారీదారులు నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.  మీ సమస్యలను వినడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎగుమతులకు మేకిన్​ ఇండియా కార్యక్రమం చాలా ముఖ్యం. మన ఎకానమీ డెవెలప్​ కావాలంటే టూరిజం ముఖ్యం. మనందరం ప్రయాణాలు చేసేటప్పుడు ఖర్చు చేసేదాంట్లో కనీసం ఐదుశాతం మొత్తాన్ని స్థానికంగా తయారయ్యే వస్తువులను కొనడానికి ఖర్చు చేయాలి”అని అన్నారు.

30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుతాం

ఈ కార్యక్రమానికి ముందు ఆంధ్రప్రదేశ్​ నగరం కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ విదేశీ వాణిజ్యానికి పెద్దపీటు వేస్తున్నామని, అమృత్ కాల్‌లో భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అన్నారు.  అనేక దేశాలు ఇండియాతో ‘ఫ్రీట్రేడ్​ అగ్రిమెంట్’ను​ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇండియా 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా మారుతుందని స్పష్టం చేశారు. గ్లోబల్​ సప్లై చెయిన్​, సర్వీసుల్లో ఇండియా విదేశీ వాణిజ్యం చురుగ్గా ఉండాలని మంత్రి ​ అన్నారు. ఇండియాకు అద్భుతమైన భవిష్యత్​ ఉందని ఐఎంఎఫ్​ చెప్పిందన్నారు.