
న్యూఢిల్లీ: శ్రీలంకతో సొంతగడ్డపై జరగబోయే సిరీస్ లో ఓ పింక్ బాల్ టెస్టు ఉంటుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుందని గురువారం వెల్లడించాడు. ఈ సిరీస్ వేదికలపై ఇంకా క్లారిటీ రాకపోయినా.. కంప్లీట్ షెడ్యూల్ త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పాడు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25–మార్చి 1 మధ్య తొలి టెస్టు బెంగళూరులో జరగాల్సి ఉంది. దీన్నే డే నైట్ టెస్టుగా జరిపే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్టు కావడంతో ఇది మరింత స్పెషల్‌గా మారనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తన హోమ్‌గ్రౌండ్‌గా భావించే చిన్నస్వామి స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ మధ్య ఈ టెస్టు ఆడటం కోహ్లీకి ప్రత్యేకంగా నిలిచిపోనుంది.
ముంబై, పుణెల్లో ఐపీఎల్
ఐపీఎల్ వేదికలపైనా గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. కరోనా మరీ పీక్ స్టేజ్ లో ఉంటే తప్ప ఈ లీగ్ ను ఇండియాలోనే నిర్వహిస్తామని చెప్పాడు. ముంబై, పుణెల్లో లీగ్ మ్యాచ్ లను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామన్నాడు. నాకౌట్ స్టేజ్ వేదికలను తర్వాత డిసైడ్ చేస్తామని తెలిపాడు. అలాగే, మేలో విమెన్స్ టీ20 చాలెంజ్ ఉంటుందని దాదా స్పష్టం చేశాడు. విమెన్స్ ప్లేయర్ల పరిధి పెరిగితే ఫ్యూచర్ లో విమెన్స్ ఐపీఎల్ ను జరిపే వీలుందన్న దాదా.. ఈసారి మాత్రం మునుపటిలాగే ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో విమెన్స్ చాలెంజ్ మ్యాచ్లను నిర్వహిస్తామని చెప్పాడు. ఇక, వెస్టిండీస్ తో జరగబోయే ఫస్ట్ వన్డే టీమిండియాకు 1000వ వన్డే కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ ను కరోనా కారణంగా ఖాళీ స్టేడియంలో నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని గంగూలీ వాపోయాడు. కరోనా వల్ల ఇలాంటి ఐకానిక్ మ్యాచ్ కు ఎలాంటి ప్లాన్స్ చేయడం లేదన్నాడు.