తొలి మహిళా CJI అయ్యే చాన్స్‌.. ఆమె ఎవరంటే?

తొలి మహిళా CJI అయ్యే చాన్స్‌.. ఆమె ఎవరంటే?

న్యూఢిల్లీ: భారత్‌కు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌ వచ్చే అవకాశాలకు నాంది పడింది. సుప్రీం కోర్టులో ఖాళీగా ఉన్న జడ్జి పదవుల భర్తీ కోసం కొలీజియం పంపిన తొమ్మిది మంది జాబితాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండడం విశేషం. వారిలో ఒకరైన జస్టిస్ బీవీ నాగరత్నం సినియారిటీ ప్రకారం భవిష్యత్తులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది.

తండ్రి కూడా సీజేఐనే

భారత సుప్రీం కోర్టు ప్రారంభమైన 71 ఏండ్ల చరిత్రలో మహిళా న్యాయమూర్తిగా అత్యున్నత న్యాయస్థానంలో అడుగు పెడుతున్న 8వ వ్యక్తి జస్టిస్ నాగరత్న. 1989లో జస్టిస్ ఎం ఫాతిమా బీవి సుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అయ్యారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న న్యాయమూర్తుల సీనియారిటీల ఆధారంగా పరిశీలిస్తే 2027 సెప్టెంబర్‌‌ 25 నుంచి అక్టోబర్ 29 వరకు జస్టిస్ నాగరత్న సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకావం ఉంది. జస్టిస్ నాగరత్న 1962 అక్టోబర్ 30న కర్ణాటకలో జన్మించారు. ఆమె 1987 అక్టోబర్‌‌లో కర్ణాటక హైకోర్ట్‌ బార్‌‌ కౌన్సిల్‌లో అడ్వొకేట్‌గా అయ్యారు. కాన్‌స్టిట్యూషనల్, కమర్షియల్ లా ప్రాక్టీస్ చేసిన ఆమె 2008లో హైకోర్టు అడిషనల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2010లో హైకోర్టు పర్మినెంట్ జడ్జి అయ్యారు. ఆమె తండ్రి జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య కూడా గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 1989 జూన్ 19 నుంచి డిసెంబర్ 17 వరకు ఆయన 19వ సీజేఐగా సేవలందించారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే

గతంలో పదవీ విరమణ పొందిన జడ్జిల స్థానాలు భర్తీ చేయకపోవడంతో మొత్తం 34 మంది న్యాయమూర్తులతో ఉండాల్సిన సుప్రీం కోర్టు ప్రస్తుతం 24 మందితోనే పని చేస్తోంది. అయితే తాజాగా కొలీజియం వేర్వేరు హైకోర్టుల్లో పని చేస్తున్న తొమ్మిది మంది న్యాయమూర్తులను సుప్రీంలో నియమించేందుకు ప్రతిపాదనలను పంపింది. వాటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మంది జాబితాలో ఏ ఒక్కరి పేరునూ తొలగించకుండా ఆమోదం తెలిపింది. కాగా, తాజాగా కొలిజీయం పంపిన జాబితాలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ కూడా ఉన్నారు. అంటే ఆమె సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనుండడంతో మళ్లీ తెలంగాణ సీజే పదవి ఖాళీ అవ్వబోతోంది.

తొమ్మిది మంది జడ్జిలు వీరే

– తెలంగాణ హైకోర్టు సీజే హిమా కోహ్లీ

– కర్ణాటక హైకోర్టు సీజే ఏఎస్ ఓకా

– కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి బీవీ నాగరత్నం

– గుజరాత్ హైకోర్టు సీజే విక్రమ్‌ నాథ్

– సిక్కిమ్ చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి

– కేరళ హైకోర్టు జడ్జి సీటీ రవి కుమార్

– మద్రాస్ హైకోర్టు జడ్జి ఎంఎం సుందరేశ్

–  గుజరాత్ హైకోర్టు జడ్జి బీలా త్రి వేది

– సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహ