ఆన్​లైన్​ పేమెంట్స్​లో అదరగొట్టాం!.. మనదేశంలో రికార్డు స్థాయిలో ట్రాన్సాక్షన్లు

ఆన్​లైన్​ పేమెంట్స్​లో అదరగొట్టాం!.. మనదేశంలో రికార్డు స్థాయిలో ట్రాన్సాక్షన్లు

న్యూఢిల్లీ: డిజిటల్​ ట్రాన్సాక్షన్ల విషయంలో మనదేశం ప్రపంచంలోనే నంబర్​వన్​గా ఎదిగింది. ఈ విషయంలో టాప్​–4 దేశాలను అధిగమించింది. మైగవ్​ఇండియా నుంచి సేకరించిన డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి.  ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ చెల్లింపులలో భారతదేశం ఏకంగా 46 శాతం వాటాను సాధించింది. డిజిటల్ చెల్లింపు రంగంలో స్పష్టమైన ఆధిపత్యాన్ని దక్కించుకుంది. మనదేశంలో జరిగినన్ని లావాదేవీలు మరే దేశంలోనూ జరగలేదు. 29.2 మిలియన్ల లావాదేవీలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా, 17.6 మిలియన్ల లావాదేవీలతో చైనా మూడో స్థానంలో నిలిచింది. మైగవ్​ఇండియా అందించిన డేటా ప్రకారం, థాయిలాండ్ 16.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో నాలుగో స్థానాన్ని పొందగా, దక్షిణ కొరియా 8 మిలియన్ల విలువైన లావాదేవీలను నమోదు చేసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. మైగవ్​ఇండియా అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్లాట్​ఫారమ్.  దేశవ్యాప్తంగా టెక్నాలజీల వాడకాన్ని పెంచడానికి కార్యక్రమాలు చేపడుతుంది. డిజిటల్ చెల్లింపులలో భారతదేశం మొదటిస్థానంలో ఉందని,  దీనివల్ల  దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో మెచ్చుకున్నారు. డిజిటల్‌‌‌‌‌‌‌‌ చెల్లింపుల్లో భారత్‌‌‌‌‌‌‌‌ మొదటి స్థానంలో ఉండటానికి మనదేశంలో మొబైల్‌‌‌‌‌‌‌‌ డేటా అత్యంత చౌకగా లభించడం కూడా కారణమని చెప్పారు.  దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఎక్స్‌‌పర్టుల అభిప్రాయం ప్రకారం, భారతదేశం  డిజిటల్ చెల్లింపుల రంగం విలువ,  పరిమాణం... రెండింటిలోనూ గణనీయమైన మైలురాళ్లను సాధిస్తోంది.  దేశ పేమెంట్స్​ ఎకోసిస్టమ్ బలోపేతం అవుతోంది.