మనం జపాన్​ను దాటేస్తాం!..ఫాస్టెస్ట్ ​గ్రోయింగ్​ నేషన్​ దిశగా ఇండియా

మనం జపాన్​ను దాటేస్తాం!..ఫాస్టెస్ట్ ​గ్రోయింగ్​ నేషన్​ దిశగా ఇండియా
  •     ఈసారి జీడీపీ గ్రోత్​ 6.9 శాతం
  •     వెల్లడించిన రేటింగ్​ ఏజెన్సీ ఫిచ్​

ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2030 నాటికి భారతదేశ జీడీపీ జపాన్‌‌ను మించిపోతుందని అంచనా. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రేటింగ్​ ఏజెన్సీ ఫిచ్​ ప్రకటించింది. అన్ని రంగాలకు భారీ డిమాండ్​ ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది.

న్యూఢిల్లీ : రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఇండియా ‘అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా’ గుర్తింపు పొందనుంది. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం స్థిరమైన జీడీపీ వృద్ధి కారణంగా ఈ ఘనతను సొంతం చేసుకోనుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్​తెలిపింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, భారతదేశ జీడీపీ 6.9 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. దీని రిపోర్టు ప్రకారం.. సిమెంట్, విద్యుత్,  పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉంటుంది. ఇది కరోనా ముందున్న స్థాయులకు చేరుకుంటుంది.

భారతదేశంలో మౌలిక సదుపాయాల కోసం పెరుగుతున్న  వ్యయం ఉక్కుకు డిమాండ్‌‌ను   పెంచుతుంది. 2023లో బలమైన వృద్ధి తర్వాత కార్ల విక్రయాలు పెరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ  జపాన్ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2030 నాటికి  భారతదేశం  జీడీపీ జపాన్‌‌ను మించిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆసియా–-పసిఫిక్ ప్రాంతంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.  కీలకమైన విదేశీ మార్కెట్లలో వృద్ధి మందగించడం వల్ల అవి బలహీనంగా ఉన్నప్పటికీ

భారతదేశంలో  కార్పొరేట్ల ఆర్థిక వృద్ధి డిమాండ్‌‌ను పెంచుతుంది. ఇన్‌‌పుట్ ఖర్చుల ఒత్తిళ్లు కూడా తగ్గవచ్చు.  2025 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో లాభాలు 2022–-23 స్థాయిల కంటే 290 బేసిస్ పాయింట్లు పెరగడానికి దోహదం చేస్తాయి. అధిక మూలధన వ్యయం ఉన్నప్పటికీ, కంపెనీలకు తగిన వృద్ధి అవకాశాలు ఉంటాయి.  

ఐటీ కొద్దిగా డల్​

జీడీపీకి పెద్దగా దోహదపడే భారతదేశ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ (ఐటీ) రంగం ఈసారి కొద్దిగా నెమ్మదించవచ్చు. ఎందుకంటే యూఎస్,  యూరోజోన్‌‌లో డిమాండ్ మందగించడం వల్ల దేశంలో ఐటీ సేవల అమ్మకాలు తగ్గే  అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల అట్రిషన్ (రాజీనామాలు),  వేతన ఒత్తిళ్లు తగ్గడం వల్ల లాభదాయకత బాగుంటుంది. సామర్థ్యం పెంపు వేగంగా జరుగుతున్నప్పటికీ, పెరుగుతున్న డిమాండ్ వల్ల సిమెంట్,  ఉక్కు రంగాలలో పరిశ్రమల సమతుల్యత కొనసాగుతుంది.

 నిర్మాణాత్మక డిమాండ్ ,  ఆరోగ్యకరమైన కార్పొరేట్,  బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు,  సంస్కరణల వల్ల చాలా రంగాలలో క్యాపెక్స్‌‌లో మరింత పెరగవచ్చు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతదేశ వృద్ధిని 6.3 శాతంగా అంచనా వేసింది. గోల్డ్‌‌మన్ శాక్స్ రీసెర్చ్ 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు అత్యధికంగా 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2024, -2026 ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశ జీడీపీ ఏటా 6-–7.1 శాతం వృద్ధి చెందుతుందని ఎస్​అండ్​పీ అంచనా వేసింది.

ఆర్​బీఐ కూడా ఇటీవలే 2023–-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 50 బేసిస్ పాయింట్లు పెంచి 7 శాతానికి చేర్చింది. అంచనాల కంటే ఎక్కువగా  జూలై–-సెప్టెంబర్ క్వార్టర్​ 7.6 శాతం వృద్ధి కనిపించడంతో వీటిని పెంచింది.