భారత్, -అమెరికా డిజిటల్ భాగస్వామ్యం వెనుక సవాళ్లు

భారత్, -అమెరికా డిజిటల్ భాగస్వామ్యం వెనుక సవాళ్లు

భారత్, -అమెరికా డిజిటల్  భాగస్వామ్యం గత మూడు దశాబ్దాలుగా వృద్ధి చెంది, అవకాశాలు,  వ్యూహాత్మక సహకారం  కలిసిపోతూ గ్లోబల్ డిజిటల్ రంగంలో ప్రత్యేకశక్తిగా అవతరించింది. కానీ, ఈ విజయకథ వెనుక దాగి ఉన్న సవాళ్లు  మరచిపోలేనివి. 1990లో  ఆర్థిక సంస్కరణల తర్వాత అమెరికా పెట్టుబడులు భారతదేశాన్ని టెక్నాలజీ,  ఐటీ,  డిజిటల్  ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్  రంగాల్లో ముందంజలో నిలిపాయి.  గూగుల్,  అమెజాన్,  మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా వంటి అమెరికా బిగ్ టెక్ సంస్థలు భారత్‌‌‌‌ను  కేవలం వినియోగదారుల స్థావరంగా కాకుండా వ్యూహాత్మక కేంద్రంగా  మలుచుకున్నాయి.  ఎఫ్​వై 24 గణాంకాల ప్రకారం యాపిల్ ఇండియా రూ. 67,121 కోట్ల ఆదాయం, అమెజాన్  రూ.40,241 కోట్లు, గూగుల్  రూ.31,221 కోట్లు,  మెటా రూ.22,731 కోట్లు,  మైక్రోసాఫ్ట్  రూ.22,900 కోట్లు సాధించాయి. ఇవన్నీ భారత్ మార్కెట్ ప్రాధాన్యతను మాత్రమే కాకుండా, అమెరికా పెట్టుబడులు స్థానిక ఆర్థిక వ్యవస్థలో ఉపాధి,  టెక్నాలజీ  బదిలీ,  ఎగుమతులపై చూపుతున్న ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

లాభనష్టాల సమతూకం

ఇరుదేశాల భాగస్వామ్యం వృద్ధికి దారి తీస్తున్నప్పటికీ, లాభనష్టాల సమతూకం ఎప్పుడూ చర్చనీయాంశమే.  భారత్, అమెరికాకు విస్తారమైన వినియోగదారుల మార్కెట్‌‌‌‌ను అందిస్తుంటే, అమెరికా కంపెనీలు భారతదేశానికి వృద్ధి ఇంజిన్‌‌‌‌గా  మారాయి.  2024లో ఇరుదేశాల మధ్య వాణిజ్య విలువ 120 బిలియన్ల డాలర్లకు చేరింది, అందులో టెక్ రంగం కీలక భాగస్వామి. అమెరికా కంపెనీలు భారత్‌‌‌‌లో దాదాపు 2.5 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించాయి. అమెజాన్ ఏడబ్ల్యూఎస్​ డేటా సెంటర్లు స్టార్టప్‌‌‌‌లకు  శక్తిమంతమైన మౌలిక వేదికను కల్పించాయి.  యూపీఐ  ఆధారిత డిజిటల్ పేమెంట్స్ 2024లో 140 బిలియన్ లావాదేవీలను దాటడం,  గూగుల్ పే,  వాట్సాప్ పేమెంట్స్,  అమెజాన్  స్మార్ట్ కామర్స్,  గూగుల్ ఫర్  స్టార్టప్స్ వంటి ప్రాజెక్టులు భారత స్టార్టప్ ఎకో సిస్టమ్‌‌‌‌ను మరింతగా బలోపేతం చేశాయి. అయినప్పటికీ, డేటా ప్రైవసీ, డిజిటల్ ట్యాక్సేషన్, ఈ -కామర్స్ నియంత్రణలపై తరచూ తలెత్తే విభేదాలు ఈ భాగస్వామ్యానికి సవాళ్లుగా నిలుస్తున్నాయి.  భారత్  ప్రవేశపెట్టిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్,  డేటా లోకలైజేషన్  విధానాలు అమెరికా కంపెనీల  కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. 2023లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం అమెరికా సంస్థలకు అదనపు ఖర్చులు, సైబర్ సెక్యూరిటీ ఒత్తిడులను తెచ్చింది.

భవిష్యత్తులో సహకారం

ఇటీవలి కాలంలో వాణిజ్య మనస్పర్ధలు, డిజిటల్ పన్నులు, స్థానిక కంటెంట్ నియమాలు ఇరుదేశాల సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయినప్పటికీ,  డిజిటల్ ఇండియా,  మేక్ ఇన్ ఇండియా,  స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు  అమెరికా కంపెనీలకు  కొత్త  వ్యూహాత్మక అవకాశాలను అందిస్తున్నాయి.  ఏఐ, 6G,  గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాల్లో సహకారం ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది.  మైక్రోసాఫ్ట్ భారత్‌‌‌‌లో ఏర్పాటు చేస్తున్న ఏఐ  రీసెర్చ్ సెంటర్లు, యాపిల్ ఐఫోన్ ఎగుమతులు 8 బిలియన్ల డాలర్లను దాటడం, అమెరికా వెంచర్ క్యాపిటల్ ఆధారంగా పెరుగుతున్న భారత స్టార్టప్ ఎకోసిస్టమ్.. ఈ అన్ని అంశాలు ఇవి రాబోయే దశాబ్దాల్లో సహకారం మరింత విస్తరించబోతున్నట్లు సూచిస్తున్నాయి. వాణిజ్య చర్చలు, ట్రేడ్ పాలసీ ఫోరమ్ సమావేశాలు విభేదాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి, భారత్, - అమెరికా డిజిటల్ అనుబంధం కేవలం టెక్నాలజీ మార్పిడి కాదు.  అది భవిష్యత్  ప్రపంచ ఆర్థిక క్రమాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మక శక్తి.  వృద్ధి అవకాశాలు ఎంతగానో ఉన్నప్పటికీ,  నియంత్రణలపై ఉద్రిక్తతలు దానిని పరీక్షిస్తూనే ఉంటాయి.  ఈ భాగస్వామ్యం తన అసలైన బలం, భవిష్యత్తు దిశను నిర్ణయించుకోనుంది.

- శ్రీనివాస్ గౌడ్ ముద్దం