
ఇండస్ట్రియలైజేషన్‌తో పుంజుకోనున్న వినియోగం
ఇన్వెస్ట్‌మెంట్లు పెంచనున్న ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు
చైనాలో చివరి దశకు చేరుకున్న పెద్ద ప్రాజెక్ట్‌లు.. అక్కడ తగ్గనున్న పెట్టుబడులు
న్యూఢిల్లీ:
రానున్న పదేళ్లలో చైనాతో పోలిస్తే ఇండియాలో ఆయిల్ వాడకం ఎక్కువగా పెరుగుతుందని ఫైనాన్షియల్ సంస్థ మూడీస్ తాజాగా ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. గత పదేళ్లలో చైనాలో ఆయిల్ డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం క్రూడాయిల్‌ను ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో చైనా నెంబర్ 2, ఇండియా నెంబర్ 3 పొజిషన్లలో ఉన్నాయి. “భారతదేశంలో క్రూడాయిల్‌కు డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. ఇందుకోసం దిగుమతులు పెంచుకోవాల్సి వస్తుంది” అని మూడీస్ పేర్కొంది. “మరోవైపు చైనా ఎకనామిక్ గ్రోత్ నెమ్మదించింది. దీనికి తోడు ఈవీరలు వంటి న్యూ ఎనర్జీ వెహికల్స్ (ఎన్‌ఈవీ) వాడకం పెరుగుతోంది. ఫలితంగా భారతదేశంతో పోలిస్తే చైనాలో క్రూడాయిల్ డిమాండ్ ఎక్కువగా ఉండదు” అని వివరించింది. మూడీస్ రిపోర్ట్ ప్రకారం, పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్స్ తయారీకి రా మెటీరియల్ అయిన క్రూడ్ ఆయిల్ వినియోగం చైనాలో రానున్న మూడేళ్లలో పీక్‌కి చేరుతుంది. అయితే భారతదేశంలో అదే పీరియడ్‌లో ఏటా 3–-5 శాతం గ్రోత్ ఉంటుంది. రెండు దేశాలూ ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కానీ, చైనా ఆయిల్ దిగుమతులు దిగొస్తున్నాయి. డిమాండ్ పెద్దగా పడిపోవడం, లోకల్‌గా ప్రొడక్షన్ పెరగడమే ఇందుకు కారణం. ఇండియా కూడా లోకల్‌గా ప్రొడక్షన్ పెంచుకోకపోతే, దిగుమతులపై మరింతగా ఆధారపడాల్సి వస్తుంది. ఇంక చైనీస్ కంపెనీలతో పోలిస్తే ఇండియన్ కంపెనీల ప్రొడక్షన్ తక్కువగా ఉంది.
ఇక నుంచి పెట్టుబడులు పెట్టాలి
క్లిష్టమైన షేల్ గ్యాస్, ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్స్‌లో చైనా ప్రభుత్వ ఆయిల్‌కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేశాయి. మరోవైపు మన ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పాతబడిన బావులు, పెట్టుబడుల కోత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అదనంగా, చైనీస్ కంపెనీలు లాభాలు మెరుగ్గా ఉన్నాయి. ఇందుకు అక్కడ సప్లయ్ చెయిన్ డెవలప్ కావడమే కారణం. “చైనీస్ కంపెనీలు క్రూడాయిల్ ఎక్స్‌ప్లోరేషన్, డెవలప్‌మెంట్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి.
డౌన్‌స్ట్రీమ్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ సెక్టార్స్‌లో వీళ్ల ఇన్వెస్ట్‌మెంట్స్ తదుపరి 3–-5 సంవత్సరాల్లో నెమ్మదిగా తగ్గుతాయి. దీనికి కారణం పెద్ద ప్రాజెక్ట్‌లు పూర్తయ్యే స్టేజ్‌కి రావడమే. ఇండియన్ ఆయిల్ కంపెనీలు మాత్రం పెరుగుతున్న ఆయిల్ డిమాండ్‌ను చేరుకోవడానికి రానున్న ఐదేళ్లలో రిఫైనింగ్, పెట్రోకెమికల్ ప్లాంట్లను విస్తరించడానికి భారీగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది” అని మూడీస్ వివరించింది.
‘‘ఇండియా ఆయిల్ కంపెనీలు లోకల్‌గా ఆయిల్, గ్యాస్ ప్రొడక్షన్‌ను పెంచాలని ప్లాన్ చేస్తున్నాయి. కానీ దీనిని ఎలా అమలు చేస్తాయో చూడాలి” అని పేర్కొంది. రెండు దేశాల్లోనూ పాలసీలు ధరలను స్థిరీకరించడం, సరిపడినంత సప్లయ్ ఉండేలా చూడడంపై ఫోకస్ పెట్టాయి. కానీ, ఇండియాలో పాలసీ ప్రభావం కంపెనీలపై ఎక్కువగా ఉంది. ఇక్కడ ధరలను ప్రభుత్వం కంట్రోల్ చేస్తోంది.
దీని ప్రభావం ఆయిల్ కంపెనీల ఆదాయాలు, క్యాష్ ఫ్లోస్‌పై ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఇండియా తన ఫిస్కల్ బడ్జెట్‌ను సపోర్ట్ చేయడానికి పెట్రోలియం సెక్టార్ నుంచి వచ్చే ట్యాక్స్‌లు, డివిడెండ్స్‌పై చైనా కంటే ఎక్కువ ఆధారపడుతోంది.
ఆయిల్ డిమాండ్
చైనా ఆయిల్ డిమాండ్ 2030 నాటికి సంవత్సరానికి 800 మిలియన్ టన్స్ (ఎంఎంటీపీఏ) వద్ద పీక్‌కి చేరుతుందని, కొద్దికొద్దిగా పెరుగుతుందని మూడీస్ అంచనా వేసింది. ఎకానమీ గ్రోత్ నెమ్మదించడంతో పాటు , క్లీన్ ఎనర్జీ వైపు చైనా షిఫ్ట్ అవుతుండడమే ఇందుకు కారణం. చైనాలో డీజిల్, గ్యాసోలిన్ వంటి ఆయిల్ ప్రొడక్ట్స్ అవసరం తగ్గుతోంది.
కానీ, విమాన ప్రయాణాలు పెరగడంతో జెట్ ఫ్యూయల్, నాఫ్తా వినియోగం పెరగొచ్చు. చైనాలో ప్రభుత్వ కంపెనీల రిఫైనింగ్ కెపాసిటీ 1 బిలియన్ టన్స్ దగ్గర ఉంది. కానీ భారతదేశం 2024 ఏప్రిల్ 1 నాటికి 256.8 ఎంఎంటీపీఏగా ఉన్న రిఫైనింగ్ కెపాసిటీని 2030 నాటికి 309.5 ఎంఎంటీపీఏకి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎకనామిక్ గ్రోత్ పెరగడం, ఇండస్ట్రియలైజేషన్, వాహనాల వాడకం పెరుగుతుండడంతో ఇండియాలో ఫ్యూయల్స్ డిమాండ్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందని అంచనా.