మిడిలార్డర్ రాణిస్తే టీమిండియాదే గెలుపు

మిడిలార్డర్ రాణిస్తే టీమిండియాదే గెలుపు

కరాచీ: ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. రెండు అగ్ర టీమ్స్ మధ్య జరిగే ఈ టోర్నమెంట్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టెస్టు సిరీస్‌‌లో ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందనేది ఇంట్రెస్టింగ్‌‌గా మారింది. ఈ సిరీస్‌లో కెప్టెన్ కోహ్లీ ఒక్క టెస్టుకే పరిమితం కానున్నాడు. ఈ నేపథ్యంలో బోర్డర్-గవాస్కర్ సిరీస్ గురించి పాకిస్తాన్ మాజీ స్పీడ్‌‌స్టర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. కోహ్లీ గైర్హాజరీ టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మిడిలార్డర్ రాణింపుపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని అక్తర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘నా అంచనా ప్రకారం టెస్టు సిరీస్‌‌ను భారత్ తిరిగి చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ టీమిండియా మిడిలార్డర్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే కష్టమే. వాళ్ల మిడిలార్డర్ బ్యాట్స్‌‌మెన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మందిలాగే ఈ సిరీస్‌‌ కోసం నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ భారత్‌‌కు సవాల్ విసరనుంది. ఒకవేళ ఆ పరిస్థితుల్లో టీమిండియా మెరుగ్గా ఆడితే అప్పుడేదైనా జరగొచ్చు. తొలి టెస్టు మొదటి రెండు ఇన్నింగ్స్‌‌లను బట్టి ఈ సిరీస్ ఎలా కొనసాగనుందో అంచనా వేయొచ్చు. విదేశాల్లో ఆడేటప్పుడు రెండు నుంచి మూడు ఇన్నింగ్స్‌‌ల్లో మంచిగా ఆడితే అంతా సాఫీగా సాగిపోతుంది. వేగంగా దూసుకొచ్చే బంతులులను డ్రైవ్ చేయకుండా, శరీరానికి దగ్గరగా ఉన్నప్పుడే ఆడాలి’ అని అక్తర్ సూచించాడు.