పేస్‌‌ బలంతోనే..ఇవాళ (నవంబర్ 07) న్యూజిలాండ్‌‌ తో ఇండియా రెండో వన్డే

పేస్‌‌ బలంతోనే..ఇవాళ (నవంబర్ 07) న్యూజిలాండ్‌‌ తో ఇండియా రెండో వన్డే
  •     రోహిత్‌‌ బ్యాటింగ్‌‌పై దృష్టి
  •     మ్యాచ్‌‌కు వర్షం ముప్పు!
  •     ఉ. 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌లో లైవ్‌‌

వెల్లింగ్టన్‌‌: న్యూజిలాండ్‌‌తో తొలి వన్డేలో దుమ్మురేపిన ఇండియా యంగ్‌‌ పేసర్లు మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. శనివారం జరిగే రెండో వన్డేలోనూ రాణించి సిరీస్‌‌లో టీమిండియాను ఆధిక్యంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ సిరీస్‌‌కు ముందు ఇండియా బౌలింగ్‌‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తొలి మ్యాచ్‌‌లో గుర్నూర్‌‌ బ్రార్‌‌, అన్షుల్‌‌ కాంబోజ్‌‌, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌తో ఆ సందేహాలను పటాపంచలు చేశారు. దాంతో హెడ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. ఇప్పటివరకు గౌతీ ఎక్కువగా ఆల్‌‌రౌండర్లకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు పేసర్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. వెల్లింగ్టన్‌‌లో స్క్వేర్‌‌ బౌండరీలు చిన్నవిగా ఉండటంతో పేసర్లు తమ బౌలింగ్ లెంగ్త్‌‌ను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. పేస్‌‌ త్రయం ఎక్కువగా పుల్లర్‌‌ లెంగ్త్‌‌తో బౌలింగ్‌‌ చేయాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌‌లో వికెట్లు తీయలేకపోయిన అకిబ్‌‌ నబీ ప్లేస్‌‌లో సిరాజ్‌‌ తుది జట్టులోకి వచ్చే చాన్స్‌‌ ఉంది. 

రోహిత్‌‌ గాడిలో పడాల్సిందే..

తొలి మ్యాచ్‌‌లో డకౌటైన రోహిత్‌‌ శర్మ వీలైనంత త్వరగా గాడిలో పడాలని మేనేజ్‌‌మెంట్‌‌ కోరుకుంటోంది. స్వదేశంలో వెస్టిండీస్‌‌పై ఆడినట్లుగా బ్యాట్‌‌ ఝుళిపించాలని భావిస్తున్నారు. స్టార్‌‌ బ్యాటర్‌‌ విరాట్ కోహ్లీ తన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. బంతి ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌ అయినా చాలా ఈజీగా బౌండ్రీలు బాదాడు. కాకపోతే షార్ట్‌‌ బాల్స్‌‌ ఆడటంపై కొద్దిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. శ్రేయస్‌‌ అయ్యర్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌ బౌన్సర్లను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు. వీలైనంత త్వరగా వీరిద్దరు ఈ బలహీనత నుంచి బయటపడాలి. కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ ఫర్వాలేదనిపించినా భారీ ఇన్నింగ్స్‌‌ ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. మిడిల్‌‌లో కేఎల్‌‌ రాహుల్‌‌, నమన్‌‌ ధీర్‌‌ చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు.

కాన్వే ఔట్‌‌..

తొలి మ్యాచ్‌‌ ఓటమితో నిరాశలో ఉన్న కివీస్‌‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బిగ్‌‌ హిట్టర్‌‌ డేవన్‌‌ కాన్వే ‘కంకషన్‌‌’తో తర్వాతి మ్యాచ్‌‌లకు దూరమయ్యాడు. తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్‌‌లో మ్యాట్‌‌ హెన్రీ.. కాన్వేను బలంగా ఢీకొట్టాడు. దాంతో అతన్ని అత్యవసరంగా ఆక్లాండ్‌‌ హాస్పిటల్‌‌కు తరలించారు. కాన్వే ప్లేస్‌‌లో నిక్‌‌ కెల్లీని జట్టులోకి తీసుకున్నారు. అయితే కెల్లీకి ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో చాన్స్‌‌ వస్తుందో లేదో చూడాలి. తొలి మ్యాచ్‌‌లో ఇండియా పేసర్ల అదనపు బౌన్స్‌‌ను ఎదుర్కోవడంలో విఫలమైన కివీస్‌‌ బ్యాటర్లు గాడిలో పడాల్సి ఉంది. సీఫెర్ట్‌‌, ఫిలిప్స్‌‌, టిక్నెర్‌‌ మినహా మిగతా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. కంకషన్‌‌ నుంచి కోలుకున్న మ్యాట్‌‌ హెన్రీ ఈ మ్యాచ్‌‌కు అందుబాటులో ఉండనున్నాడు. బౌలింగ్‌‌లో జాకబ్‌‌ డఫీ రాణించినా.. జెమీసన్‌‌, టిక్నెర్‌‌, నాథన్‌‌ స్మిత్‌‌ వైఫల్యం టీమ్‌‌ను వెంటాడుతోంది.

తుది జట్లు (అంచనా)

ఇండియా: శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (కెప్టెన్‌‌), రోహిత్‌‌ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌‌ అయ్యర్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌, నమన్‌‌ ధీర్‌‌, అన్షుల్‌‌ కాంబోజ్‌‌, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌, అకిబ్‌‌ నబీ, గుర్నూర్‌‌ బ్రార్‌‌.  

న్యూజిలాండ్‌‌: మిచెల్‌‌ శాంట్నర్‌‌ (కెప్టెన్‌‌), విల్‌‌ యంగ్‌‌, టిమ్‌‌ సీఫెర్ట్‌‌, హెన్రీ నికోల్స్‌‌, డారిల్‌‌ మిచెల్‌‌, టామ్‌‌ లాథమ్‌‌, గ్లెన్‌‌ ఫిలిప్స్‌‌, నాథన్‌‌ స్మిత్‌‌, కైల్‌‌ జెమీసన్‌‌, జాకబ్‌‌ డఫీ, బ్లెయిర్‌‌ టిక్నెర్‌‌.