
టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. దీనిపై స్పందించిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ…కివీస్‌లో పరిస్థితుల గురించి అతిగా ఆలోచించి బ్యాట్స్‌మెన్ తప్పు చేశారని అన్నాడు. తమ ఆలోచనల్లో సంఘర్షణ కారణంగానే సిరీస్‌లో ఓడిపోయామని అన్నాడు. ఇక్కడ ఎలా ఆడాలో బ్యాట్స్‌మెన్‌కు ఓ క్లారిటీ లేకపోవడం తమను దెబ్బకొట్టిందన్నాడు. గతంలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బాగా ఆడామని గుర్తు చేశాడు. అప్పుడు తామంతా ఓ స్పష్టమైన ఆలోచనతో ఉన్నామన్నాడు. ఈ సిరీస్‌లో అది లోపించిందన్నాడు. టెస్టులు ఆడుతున్నప్పుడు ప్రతి రోజు, ప్రతి సెషన్, ప్రతి పరిస్థితిలో సానుకూలంగా ఆలోచించాల్సి ఉంటుందని అన్నాడు. కానీ, తమ బ్యాటింగ్ విభాగం మొత్తం ఫెయిలైందన్నాడు. తొలి టెస్టు తొలి రోజు నుంచే పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించి తప్పు చేశామన్నాడు కోహ్లీ. ఈ ఓటమి తమకు ఓ పాఠం లాంటిదని.. సిరీస్‌లో చేసిన పొరపాట్లను సమీక్షించుకొని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపాడు కోహ్లీ.