Cricket World Cup 2023: ఇండియా - పాక్ మ్యాచ్ రోజే నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చేస్తాం.. బీసీసీఐకి మెయిల్‌  

Cricket World Cup 2023: ఇండియా - పాక్ మ్యాచ్ రోజే నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చేస్తాం.. బీసీసీఐకి మెయిల్‌  

అక్టోబర్‌ 14న నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ మొత్తం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోనుంది. లక్ష మందికి పైగా ప్రేక్షకులు హాజరుకానుండటంతో అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓవైపు ఇలా ఉంటే.. మరోవైపు ఈ  మ్యాచ్ జరగనివ్వమన్న హెచ్చరికలు అధికమవుతున్నాయి. ఇండియా - పాక్ మ్యాచ్ రోజు నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చేస్తాం అంటూ మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. ఆకాశమన్న పేరుతో బీసీసీఐకి మెయిల్ పంపాడు. 

"14-10-2023న మతేరా ప్రాంతంలో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో పేలుడు జరుగుతుందని.. ఆ పేలుడు ధాటికి అందరూ వణుకుతారు' అని బీసీసీఐకి హిందీలో మెయిల్ పంపాడు. ఈ ఘటనపై రహస్యంగా విచారణ జరిపిన పోలీసులు.. నిందితుడిని రాజ్‌కోట్‌లో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

505 (1) బి, 506 (2) సెక్షన్ల కింద కేసులు

స్టేడియాన్ని పేల్చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడిన నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.సెక్షన్‌ 505 (1) బి (ప్రజలలో భయం లేదా భయాన్ని కలిగించడానికి ఉద్దేశించిన చట్టం ద్వారా ప్రజా దుర్మార్గం), సెక్షన్‌ 506 (2) నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన కింద కేసులు నమోదు చేశారు.

11 వేల మందికిపై భద్రతా సిబ్బంది

ఇండియా- పాక్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. 48 గంటల పాటు అహ్మదాబాద్ నగరం మొత్తం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోనుంది. 11 వేల మందితో ఈ మ్యాచ్ కు భద్రత కల్పించనున్నారు. ఇందులో స్థానిక పోలీసులు, హోమ్ గార్డులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉండనున్నారు. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ సంబంధ దాడులను కూడా అడ్డుకునేలా భద్రతా సిబ్బందిని భారీగానే మోహరిస్తున్నారు.