
- సెంచూరియన్‌లో తొలిసారి గెలుపు
- సౌతాఫ్రికాను పడగొట్టిన పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్
టీమిండియా ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ ముందే వచ్చేసింది..! 2021కు సూపర్ ఫినిషింగ్ ఇస్తూ.. 2022కి గ్రాండ్ వెల్‌కం చెప్పేలా గ్రౌండ్‌లో కోహ్లీసేన కమాల్ చేసింది..! ఫస్ట్ టెస్టులో సఫారీపై గ్రాండ్ విక్టరీ కొట్టింది..! ఈ ఏడాదే ఆస్ట్రేలియా కంచుకోట ‘గబ్బా’ను బద్దలు కొట్టి ఆ దేశంలో రెండోసారి సిరీస్ గెలిచిన మన టీమ్.. ఇప్పుడు సెంచూరియన్‌లో తొలి విజయంతో సఫారీల గడ్డపై టెస్ట్ సిరీస్‌కు రూట్ క్లియర్ చేసుకుంది..! మనోళ్ల జోరు.. ముఖ్యంగా పేసర్ల హవా ఇలానే కంటిన్యూ అయితే 2022లో ఆల్‌టైమ్ బెస్ట్ టెస్ట్ టీమ్‌గా టీమిండియా పేరు తెచ్చుకోవడం పక్కా..!
సెంచూరియన్: ఈ జనరేషన్‌లోనే బెస్ట్ అనిపించేలా ఉన్న మన పేస్ బౌలింగ్ యూనిట్.. సౌతాఫ్రికాపై ఎటాక్ చేసింది. పవర్‌ఫుల్ పేస్‌తో సఫారీ బ్యాటర్లను వణికించింది. దాంతో, ఫస్ట్ టెస్టులో 113 రన్స్ తేడాతో హోమ్ టీమ్‌ను చిత్తు చేసింది. సఫారీ టీమ్ కంచుకోట అయిన సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్కులో ఫస్ట్ విక్టరీ సాధించిన టీమిండియా... రెయిన్‌బో నేషన్‌లో సిరీస్ సొంతం చేసుకునేందుకు తొలి అడుగు వేసింది. బుమ్రా (3/50), షమీ (3/63), సిరాజ్ (2/47), స్పిన్నర్ అశ్విన్ (2/18) దెబ్బకు 305 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో చివరి రోజు, గురువారం సౌతాఫ్రికా 191 రన్స్‌కే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (77), టెంబా బవూమ (35 నాటౌట్), డికాక్ (21) మాత్రమే కొద్దిసేపు పోరాడారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 327, సౌతాఫ్రికా 174 రన్స్ చేయగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 197 చేసింది. ఈ విక్టరీతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇండియా 1–0తో లీడ్ సాధించింది. సెకండ్ టెస్టు 3న జొహన్నెస్‌బర్గ్‌లో స్టార్ట్ అవుతుంది.
పేసర్ల హవా
సౌతాఫ్రికా గెలవాలంటే 211 రన్స్ చేయాలి. ఇండియాకు 6 వికెట్లు కావాలి. ఒక రోజు టైమ్ ఉంది. వాన వచ్చే సూచన కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌లో రెండు టీమ్స్‌కు విక్టరీ చాన్స్‌తో పాటు డ్రా అయ్యే అవకాశం ఉంది. కానీ, విక్టరీ తప్ప మరో ఆలోచనే లేని ఇండియా పేసర్లు కేవలం 27 ఓవర్లోనే మిగతా ఆరు వికెట్లు తీసి టీమ్‌ను గెలిపించారు. గత రెండ్రోజుల లెక్కనే గురువారం కూడా వికెట్ల కోసం పోటీ పడి హోమ్‌టీమ్ బ్యాటర్లను దెబ్బ కొట్టారు. వాస్తవానికి ఓవర్‌నైట్ స్కోరు 94/4తో ఛేజింగ్ కంటిన్యూ చేసిన సౌతాఫ్రికా డేను మంచిగనే స్టార్ట్ చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్, బవూమ తొలి 45 నిమిషాలు స్పీడ్‌గా ఆడారు. వరుసగా బౌండ్రీలు కొట్టి 36 రన్స్ రాబట్టారు. ఈ క్రమంలో ఎల్గర్‌కు ఓ లైఫ్ కూడా వచ్చింది. తనిచ్చిన రిటర్న్ క్యాచ్‌ను షమీ డ్రాప్ చేశాడు. కానీ, కండీషన్స్‌ను యూజ్ చేసుకుంటూ పవర్‌ఫుల్ బాల్స్‌తో ఎల్గర్‌కు సవాల్ విసిరిన బుమ్రా పదో ఓవర్లో అతడిని ఎల్బీ చేసి ఇండియా విక్టరీకి బాట వేశాడు. దీనికి ఎల్గర్ రివ్యూ కూడా వేస్ట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డికాక్ (21).. బుమ్రా బౌలింగ్‌లో ఒకటి రెండు మంచి షాట్లు కొట్టాడు. వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాలని కౌంటర్ ఎటాక్ చేశాడు. దాంతో, బుమ్రా ప్లేస్‌లో సిరాజ్‌ను బౌలింగ్‌కు దింపాడు కోహ్లీ. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన సిరాజ్.. డికాక్‌ను బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే ముల్డర్ (1)ను షమీ ఏడో వికెట్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే మరో ఎండ్‌లో బవూమ ఫైటింగ్ కంటిన్యూ చేశాడు. జాన్సెన్ (13)తో కలిసి 182/7తో టీమ్‌ను లంచ్‌కు తీసుకెళ్లాడు. లంచ్ తర్వాత షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన జాన్సెన్ ఐదో బాల్‌కు కీపర్‌కు చిక్కాడు. స్పిన్నర్ అశ్విన్.. రబాడ (0), ఎంగిడి (0)ని ఔట్ చేసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
స్కోర్స్
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 327; సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్:197; ఇండియా రెండో ఇన్నింగ్స్: 174; సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 305): 68 ఓవర్లలో 191 ఆలౌట్ (ఎల్గర్ 77, బవూమ 35 నాటౌట్, బుమ్రా 3/50, షమీ 3/63).