వన్డేల్లోనూ ఫట్‌..సెకండ్ మ్యాచ్ లో ఇండియా ఓటమి

వన్డేల్లోనూ ఫట్‌..సెకండ్ మ్యాచ్ లో ఇండియా ఓటమి

పార్ల్: టీమిండియా మళ్లీ ఫెయిలైంది. స్టార్‌‌ ప్లేయర్లతో ఫేవరెట్‌‌గా  సౌతాఫ్రికా గడ్డపై అడుగు పెట్టిన మన టీమ్‌‌  మ్యాచ్‌‌ మ్యాచ్‌‌కూ మరింత చెత్త పెర్ఫామెన్స్‌‌ చేస్తోంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌‌లో ఓడిన ఇండియా. వన్డేల్లో కూడా చేతులెత్తేసింది. సిరీస్‌‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పోరులో బ్యాటింగ్‌‌ కొంచెం ఇంప్రూవ్‌‌ అయినా బౌలర్లు చేతులెత్తేశారు. దాంతో, శుక్రవారం జరిగిన సెకండ్‌‌ వన్డేలో ఇండియా 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతిలో చిత్తయింది. ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో అదరగొట్టిన సఫారీ టీమ్‌‌ మరో మ్యాచ్‌‌ మిగిలుండగానే సిరీస్‌‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ వన్‌‌సైడెడ్‌‌ మ్యాచ్‌‌లో ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 50 ఓవర్లలో 287/6 స్కోరు చేసింది. రిషబ్‌‌ పంత్‌‌ (71 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85) సత్తా చాటాడు. కెప్టెన్‌‌ లోకేశ్‌‌ రాహుల్‌‌ (79 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 55), లాస్ట్‌‌లో శార్దూల్‌‌ ఠాకూర్​(40 నాటౌట్‌‌) రాణించారు. అనంతరం ఓపెనర్లు జనేమన్‌‌ మలన్‌‌ (108 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 91), క్వింటన్‌‌ డికాక్‌‌ (66 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 78)  విజృంభించడంతో హోమ్‌‌టీమ్‌‌ 48.1 ఓవర్లలోనే 288/3 స్కోరు చేసి గ్రాండ్‌‌ విక్టరీ సాధించింది. డికాక్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. సిరీస్‌‌లో లాస్ట్‌‌ వన్డే ఆదివారం జరుగుతుంది. 

పంత్‌‌ ఫటాఫట్‌‌

ఇండియా ఇన్నింగ్స్‌‌లో రిషబ్‌‌ పంత్‌‌ హీరోగా నిలిచాడు. అతనితోపాటు కెప్టెన్‌‌ రాహుల్‌‌, చివర్లో శార్దూల్‌‌ ఆకట్టుకున్నా మన టీమ్‌‌ పెద్ద స్కోరు చేయలేకపోయింది.  టాస్‌‌ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్‌‌ చేసిన ఇండియాకు మంచి స్టార్ట్‌‌ దక్కింది. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఫెయిలైన కెప్టెన్‌‌  రాహుల్‌‌..శిఖర్‌‌ ధవన్‌‌ (29)తో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 63 రన్స్‌‌ యాడ్​ చేశాడు. అయితే, పెద్ద ఇన్నింగ్స్‌‌ ఆడేలా కనిపించిన ధవన్‌‌.. మలన్‌‌ (1/34)  వేసిన 12వ ఓవర్లో స్లాగ్‌‌ స్వీప్‌‌ షాట్‌‌ ఆడి మగాల కు క్యాచ్‌‌ ఇచ్చాడు.  తర్వాతి ఓవర్లోనే మరో స్పిన్నర్‌‌ కేశవ్‌‌ (1/52) వేసిన ఔట్‌‌ సైడ్‌‌ ఆఫ్‌‌ స్టంప్‌‌ బాల్‌‌ను విరాట్‌‌ కోహ్లీ (0)  కవర్స్‌‌లో బవూమ చేతిలోకి కొట్టి డకౌట్‌‌ అవడంతో అంతా షాకయ్యారు. ఈ టైమ్‌‌లో రాహుల్‌‌కు పంత్‌‌ తోడయ్యాడు. రిషబ్‌‌ తనదైన స్టయిల్లో దూకుడుగా బ్యాటింగ్‌‌ చేయగా.. కెప్టెన్‌‌ రాహుల్‌‌ మరో ఎండ్‌‌లో యాంకర్‌‌ రోల్‌‌ ప్లే చేశాడు. ఇద్దరు లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్లు కేశవ్‌‌, షంసి (2/57) బౌలింగ్‌‌ను రిషబ్‌‌ ఈజీగా ఎటాక్‌‌ చేశాడు. లాఫ్టెడ్‌‌ షాట్‌‌తో  లాంగాన్‌‌ మీదుగా సిక్స్‌‌ మాత్రమే కాకుండా.. స్వీప్‌‌ షాట్లతో బౌండ్రీలు కొట్టి ఆకట్టుకున్నాడు.  ఈ క్రమంలో పంత్‌‌తో పాటు లోకేశ్‌‌ ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకున్నాడు. కానీ, సెకండ్‌‌ స్పెల్‌‌లో బౌలింగ్‌‌కు దిగిన మగాల (1/64) రాహుల్‌‌ను  ఔట్‌‌ చేయడంతో  థర్డ్‌‌ వికెట్‌‌కు 115 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇక, సెంచరీ చేసేలా కనిపించిన పంత్‌‌.. షంసి వేసిన తర్వాతి  ఓవర్లోనే  భారీ షాట్‌‌కు ట్రై చేసి.. మార్‌‌క్రమ్‌‌కు చిక్కాడు. . దాంతో, ఇండియా స్పీడుకు బ్రేకులు పడ్డాయి. మగాలతో పాటు ఫెలుక్వాయో (1/44) స్లో బాల్స్‌‌, కట్టర్స్‌‌తో 33–43 ఓవర్ల మధ్య రన్స్‌‌ కంట్రోల్‌‌ చేశారు.   శ్రేయస్‌‌ (11), వెంకటేశ్‌‌ (22) నిరాశ పరిచారు. అయితే, శార్దూల్‌‌ మరోసారి బ్యాట్‌‌తో మెప్పించాడు. వెంకటేశ్‌‌తో ఆరో వికెట్‌‌కు 32, అశ్విన్‌‌ (25 నాటౌట్‌‌)తో కలిసి ఏడో వికెట్‌‌కు 38 బాల్స్‌‌లో 48 రన్స్‌‌ పార్ట్​నర్​షిప్స్​తో  ఇండియాకు మంచి స్కోరు అందించాడు. 

స్కోర్స్‌‌

ఇండియా: 50 ఓవర్లలో 287/6 ( రిషబ్‌‌ పంత్‌‌ 85, రాహుల్‌‌ 55, షంసి 2/57).
సౌతాఫ్రికా: 48.1 ఓవర్లలో 288/3 (మలన్‌‌ 91, డికాక్‌‌ 78, బుమ్రా 1/37). 

సఫారీలు ఈజీగా..

టాపార్డర్‌‌ దంచికొట్టడంతో టార్గెట్‌‌ను సౌతాఫ్రికా ఈజీగా ఛేజ్‌‌ చేసింది. ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఫెయిలైన ఓపెనర్లు జనేమన్‌‌ మలన్‌‌, క్వింటన్‌‌ డికాక్‌‌ స్టార్టింగ్‌‌ నుంచే సూపర్‌‌గా ఆడారు.  బుమ్రా (1/37) తప్ప ఇండియా బౌలర్లంతా ఫెయిలయ్యారు. ఐదోబాల్‌‌నే బౌండ్రీకి చేర్చిన డికాక్‌‌.. భువనేశ్వర్‌‌ (0/67) వేసిన సెకండ్‌‌ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్‌‌తో రెచ్చిపోయాడు. దాంతో, కెప్టెన్‌‌ రాహుల్‌‌ నాలుగో ఓవర్లో స్పిన్నర్‌‌ అశ్విన్‌‌ (0/68)ను  దింపాడు. కానీ, అతని బౌలింగ్‌‌లో ఎనిమిదో ఓవర్లో డికాక్‌‌ను స్టంపౌట్‌‌ చేసే చాన్స్‌‌ను కీపర్‌‌ పంత్‌‌ మిస్‌‌ చేశాడు. అప్పటికి క్వింటన్‌‌ 32 రన్స్‌‌ వద్దే ఉన్నాడు. ఈ లైఫ్‌‌ను యూజ్‌‌ చేసుకున్న సఫారీ ఓపెనర్‌‌ నెక్స్ట్‌‌ బాల్‌‌నే స్వీప్‌‌​తో సిక్స్‌‌ కొట్టాడు. మరో ఎండ్‌‌లో మలన్‌‌ కూడా గేరు మార్చి బౌండ్రీలు బాదడంతో 16 ఓవర్లలోనే స్కోరు వంద దాటింది.  డికాక్‌‌ను ఎట్టకేలకు 22వ ఓవర్లో శార్దూల్‌‌ ఎల్బీ చేయడంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 132  రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయింది. అయితే అప్పటికే ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకున్న మలన్‌‌ అదే స్పీడు కంటిన్యూ చేశాడు. అశ్విన్‌‌ తర్వాతి ఓవర్లోనే భారీ సిక్స్‌‌ కొట్టగా.. తనకు కెప్టెన్‌‌ బవూమ (35)  తోడయ్యాడు. ఇద్దరూ పోటీ పడి ఆడటంతో 34 ఓవర్లోనే స్కోరు 200 దాటింది. అయితే, సెంచరీకి దగ్గరైన మలన్‌‌ను బుమ్రా ఆఫ్‌‌ కట్టర్‌‌తో బౌల్డ్‌‌ చేయగా.. నెక్స్ట్‌‌ ఓవర్లోనే బవూమను చహల్‌‌ రిటర్న్‌‌ క్యాచ్‌‌తో పెవిలియన్‌‌ చేర్చాడు. దాంతో ఇండియా క్యాంప్‌‌లో ఆశలు చిగురించాయి. అప్పటికి 14వ ఓవర్లలో 73 రన్స్‌‌ మాత్రమే అవసరం అవగా.. లాస్ట్‌‌ మ్యాచ్‌‌ సెంచరీ హీరో డుసెన్‌‌ (37 నాటౌట్‌‌)తో పాటు మార్‌‌క్రమ్‌‌ (37 నాటౌట్‌‌)  మరో 11 బాల్స్‌‌ మిగిలుండగానే మ్యాచ్‌‌ను ముగించారు.