
కొలంబో: విమెన్స్ ట్రై నేషన్స్ సిరీస్‌లో ఇండియా జట్టు ఫైనల్ బెర్త్‌పై గురి పెట్టింది. బుధవారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ పరాజయంతో ప్రస్తుతం నాలుగు పాయింట్లతో టీమిండియా టాప్‌లో ఉంది. ఇన్నే పాయింట్లతో రెండో ప్లేస్‌లో ఉన్న లంక నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురుకానుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించాలని హర్మన్‌సేన భావిస్తోంది. ఇది జరగాలంటే బౌలింగ్ బాగా మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇండియాను గెలిపించిన బౌలర్లు గత మ్యాచ్‌లో లంకపై తేలిపోయారు. సీమర్ కశ్వీ గౌతమ్ ఐదు ఓవర్ల తర్వాత గ్రౌండ్ నుంచి వెళ్లిపోవడం మైనస్‌గా మారింది. స్నేహ్ రాణా 3 వికెట్లతో పోరాటం చేసినా అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, ప్రతీక రావల్, శ్రీచరణి ఆశించిన మేరకు రాణించలేదు.
దీంతో సఫారీలపై గాడిలో పడితే ఫైనల్లోనూ సత్తా చూపొచ్చని భావిస్తున్నారు. బ్యాటింగ్‌లో ప్రతీకా రావల్ మెరుస్తున్నా.. స్మృతి మంధాన బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది. హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్, జెమీమా, రిచా ఘోష్ మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. లోయర్ ఆర్డర్‌లో దీప్తి, కశ్వీ అండగా నిలవాల్సిన టైమ్ వచ్చేసింది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సౌతాఫ్రికా ఫామ్ కోసం తంటాలు పడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బ్యాటర్లు స్ట్రయిక్ రొటేట్ చేయడంలో తడబడుతున్నారు. బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు క్రమశిక్షణ లోపించింది. దీంతో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దీనివల్ల ఒత్తిడికి లోనై వికెట్లు తీయడం కష్టంగా మారింది. ఇక లంకతో అధిక వేడి తట్టుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. బ్రిట్స్, కరాబో మెసో లేకపోవడం ప్రతికూలాంశం. ఓవరాల్‌గా రాబోయే రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఫైనల్ రేసులో నిలవాలని ప్రొటీస్ లక్ష్యంగా పెట్టుకుంది.