నేటి నుంచి రెండో టెస్ట్..రిషబ్​పైనే దృష్టి

నేటి నుంచి రెండో టెస్ట్..రిషబ్​పైనే దృష్టి

కింగ్‌‌స్టన్ప్రతిష్టాత్మక టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ను ఘనంగా మొదలుపెట్టిన టీమిండియా.. పాయింట్ల ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. దీంతో నేటి నుంచి జరిగే రెండో టెస్ట్‌‌లో వెస్టిండీస్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో ఇప్పటికే 1–0 ఆధిక్యంలో ఉన్న విరాట్‌‌సేన ఈ మ్యాచ్‌‌లోనూ గెలిచి సిరీస్‌‌ను క్లీన్‌‌స్వీప్​చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి టెస్ట్​లో 318 పరుగుల భారీ తేడాతో నెగ్గిన ఇండియా.. రెండో టెస్ట్‌‌లోనూ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతున్నది. మిడిలార్డర్ సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ఇప్పుడు వికెట్‌‌ కీపర్‌‌‌‌పై దృష్టిసారించింది. ఇండియాలో బిజీ షెడ్యూల్‌‌ ఉండటంతో అందుకు అనుగుణంగా ఆటగాళ్లను సిద్ధం చేయాలని చూస్తోంది. మరోవైపు ఇండియా చేతిలో వరుసగా ఎదురైన పరాజయాలకు చెక్‌‌ పెట్టాలని విండీస్‌‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్టార్లు అందుబాటులో ఉన్నా.. సమష్టిగా ఆడలేకపోవడం టీమ్​ ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీస్తున్నది.

మార్పుల్లేవు..!

తొలి టెస్ట్‌‌లో భారీ విజయం సాధించిన టీమ్‌‌నే ఈ మ్యాచ్‌‌కూ కొనసాగించాలని మేనేజ్‌‌మెంట్​భావిస్తోంది. దీంతో తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనబడటం లేదు. అయితే వికెట్‌‌ కీపర్​ రిషబ్‌‌ పంత్​ఫామ్‌‌ ఆందోళన కలిగిస్తోంది. రన్స్​చేయడం కంటే అతను​ఔటవుతున్న తీరు అందర్ని కలవరపెడుతోంది. 21 ఏళ్ల పంత్‌‌పై అటు విరాట్, ఇటు మేనేజ్‌‌మెంట్​ఎంతో నమ్మకం పెట్టుకుంది. ధోనీ వారసుడిగా ముద్రపడటంతో చాలా ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. అయినా దానిని నిలబెట్టుకోవడంలో ఈ ఢిల్లీ ప్లేయర్​విఫలమవుతూనే ఉన్నాడు. టీ20ల నుంచి మొదలుపెడితే తొలి టెస్ట్‌‌ వరకు అతను చేసిన స్కోర్లు 0, 4, 65 నాటౌట్, 20, 0, 24, 7. ఇంత పేలవ ఫామ్‌‌ కనబరుస్తున్నా.. అతన్ని టీమ్‌‌లో కొనసాగిస్తున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. సీనియర్​​కీపర్​ వృద్ధిమాన్‌‌ సాహా అందుబాటులోకి వచ్చాడు. కనీసం ఈ మ్యాచ్‌‌లోనైనా అతనికి అవకాశం ఇస్తారా? చూడాలి. కుర్ర వికెట్‌‌ కీపర్​ కోనా భరత్‌‌ కూడా లైన్‌‌లో ఉన్నాడు. ఓపెనర్లలో మయాంక్​అగర్వాల్​అంచనాలను అందుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇండియాలో సౌతాఫ్రికాతో సిరీస్‌‌ నేపథ్యంలో రోహిత్‌‌ను ఓపెనర్‌‌‌‌గా పరీక్షించాలనుకుంటే మయాంక్‌‌ బెంచ్‌‌కే పరిమితం అవుతాడు. రాహుల్‌‌తో కలిసి ఈ ముంబైకర్ ఇన్నింగ్స్​ఆరంభిస్తాడు. రెడ్​బాల్‌‌ను ఎదుర్కోవడంలో రోహిత్‌‌ టెక్నికల్‌‌గా ఇబ్బందిపడుతున్నా.. స్వదేశంలో మాత్రం అతనికి తిరుగులేదు. ఇన్నాళ్లూ సమస్యగా ఉన్న మిడిలార్డర్​తొలి టెస్ట్‌‌లో అద్భుతం చేసింది. ముఖ్యంగా ఒత్తిడిలో రహానె ఆడిన తీరు సూపర్బ్. తెలుగు కుర్రాడు హనుమ విహారి కూడా రోహిత్‌‌ను కాదని తనను ఎంపిక చేయడం కరెక్టేనని నిరూపించుకున్నాడు. బౌలింగ్‌‌లో బుమ్రా, ఇషాంత్‌‌కు తిరుగులేదు. ఈ ఇద్దరూ తొలి టెస్ట్‌‌లో ఐదు వికెట్లతో సత్తా చాటారు. షమీ కూడా మంచి సమన్వయాన్ని అందిస్తుండటం కలిసొచ్చే అంశం. ఒకవేళ ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల వ్యూహం అయితే అశ్విన్‌‌కు చాన్స్​ దక్కుతుంది.

ఒక్కరు కూడా.. 

ప్రస్తుతం విండీస్‌‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే టీమ్‌‌లో నైపుణ్యం ఉన్న ప్లేయర్లకు కొదువలేదు. అయినా ఏ ఒక్కరు క్రీజులో నిలబడేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఓపెనింగ్‌‌లో బ్రాత్‌‌వైట్‌‌, క్యాంప్‌‌బెల్‌‌ సరైన ఆరంభాన్నివ్వడం లేదు. ముఖ్యంగా బుమ్రాను ఎదుర్కోవడంలో ఈ జంట ఘోరంగా తడబడుతున్నది. మిడిలార్డర్‌‌‌‌లో హెట్‌‌మయర్‌‌‌‌, హోప్‌‌, ఛేజ్, బ్రావోపై భారీ ఆశలున్నా.. ఒక్కరు కూడా షైన్‌‌ కావడం లేదు. తొలి టెస్ట్‌‌ రెండు ఇన్నింగ్స్‌‌ల్లో కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. సొంతగడ్డ అనుకూలత ఉన్నా.. అందుకు తగ్గట్టుగా ఆడటంలో ఏ ఒక్కరు ముందుకురావడం లేదు. బ్యాటింగ్‌‌ లైనప్‌‌ ఘోరంగా తడబడుతున్నా.. బౌలింగ్‌‌లో మాత్రం రోచ్, గాబ్రియెల్ ఆకట్టుకోవడం సానుకూలాంశం. ఇతరుల నుంచి పెద్దగా సహకారం లేకపోయినా ఈ ఇద్దరు మాత్రం బంతితో నిప్పులు కురిపిస్తున్నారు. హోల్డర్​ రెండింటిలో విఫలంకావడం అతిపెద్ద లోటుగా కనిపిస్తోంది. ఒకవేళ మార్పులు చేస్తే భారీ కాయుడు రకీమ్ కార్న్​వాల్ తుది జట్టులోకి దిగొచ్చు.  ఓవరాల్‌‌గా ఈ మ్యాచ్‌‌లోనూ ఇండియా బ్యాట్స్‌‌మెన్, విండీస్ పేస్ త్రయానికి పోరు తప్పకపోవచ్చు.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), మయాంక్‌‌, రాహుల్‌‌, పుజార, రహానె, విహారి, పంత్‌‌, జడేజా, ఇషాంత్‌‌, షమీ / అశ్విన్‌‌, బుమ్రా.

వెస్టిండీస్: హోల్డర్‌‌‌‌ (కెప్టెన్‌‌), బ్రాత్‌‌వైట్‌‌, క్యాంప్‌‌బెల్‌‌, బ్రావో, ఛేజ్‌‌, హోప్‌‌, హెట్‌‌మయర్‌‌‌‌, రకీమ్‌‌, పాల్‌‌, రోచ్‌‌, గాబ్రియెల్‌‌.

పిచ్‌‌, వాతావరణం

పచ్చిక వికెట్‌‌. పేసర్లు ప్రభావం చూపుతారు. స్పిన్‌‌ కు పెద్దగా అనుకూలం కాదు. వర్షం ముప్పులేదు.

మరిన్ని వెలుగు  వార్తల కోసం క్లిక్ చేయండి