శ్రీ అన్నయోజనతో ఆరోగ్య భారత్​

శ్రీ అన్నయోజనతో ఆరోగ్య భారత్​

2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా ఐక్యరాజ్య సమితిలోని 72 సభ్య దేశాలు బలపరిచాయి. దీంతో యూఎన్​2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది.76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిరుడు ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దేశ సంస్కృతీ సంప్రదాయాల్లో చిరుధాన్యాలు కూడా ఒక భాగంగా వచ్చాయని చెప్పారు. అందుకే తాజా కేంద్ర బడ్జెట్​లో దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ‘శ్రీ అన్న’ యోజనను మోడీ ప్రారంభించారు.

భారత్​లో చిరు ధాన్యాలను ఎక్కువగా వాడే ఉన్నత సాంప్రదాయం ఉంది. చిరుధాన్యాలను ఆహారపు అలవాటుగా, వంటకాలు, పండుగలు, శుభకార్యాల్లో ఎలా వినియోగించేవారో తెలియజేసే సాహిత్యం, పుస్తకాలు, అనేకం ఉన్నాయి. ప్రపంచంలో చిరుధాన్యాలను పండించిన మొదటి దేశం మనదే. మినుములను వినియోగించే గొప్ప సంప్రదాయం భారత్​లో ఉంది. సింధు లోయ నాగరికతలో మినుములను వాడినట్లు అనేక ఆధారాలు ఉన్నాయి. చిరుధాన్యాల ప్రాధాన్యత గురించి యజుర్వేదంలో ఉంది. శుశ్రూతుడు రచించిన సంహితలో పలురకాల ధాన్యాలను- ధాన్య వర్గాలుగా, ఖుధాన్య వర్గాలుగా, సమిధాన్య వర్గాలుగా విభజించాడు. చిరుధాన్యాలను ఖుధాన్య వర్గాల కింద పేర్కొన్నాడు. కణ్వ మహర్షి తన కూతురు శకుంతలను దుష్యంతుని అంతఃపురంలో విడిచిపెట్టే సందర్భంలో కొర్ర బియ్యం రాసులను సమర్పించాడని మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’లో అభివర్ణించాడు. దీన్ని బట్టి కొర్రలకు ఆపాదించిన పవిత్రతను అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల చిరుధాన్యాలను నానబెట్టినా లేదా ఉడికించినా వాటికి ఉండే విశిష్టతల గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించాడు. కన్నడ భక్తి కవి పురందర దాసుడు ‘రాగి థండీరా’ గురించి రాశాడు. మరో కన్నడ కవి కనక దాస తన గ్రంథం “రామ ధన్య చరిత్రే" లో రాగి పంట బలహీన వర్గాల ప్రజలకు చెందినదని తెలియజేస్తూ బలవంతమైన వరి పంటతో రాగికి ఉన్న వైరం గురించి రాస్తూ అద్భుత సామాజిక సందేశాన్నిచారు. అబూ ఫజల్ రాసిన “అయిన్ ఇ అక్బరీ" గ్రంథంలో మన దేశంలో ఏ ప్రాంతంలో రైతులు ఏ రకాలకు చెందిన చిరుధాన్యాలు పండిస్తున్నారో సమగ్రంగా వివరించాడు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ కు సజ్జలతో చేసిన కిచిడీ ‘లజీజియా’ అంటే ఎంతో ఇష్టమైన వంటకం. ఈ వంటకం గుజరాత్ రాష్ట్రానికి చెందినదని తన సాహిత్యంలో వివరించాడు.

ఆరోగ్యం, సంపద!

చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వాటికి చాలా సుగుణాలు ఉన్నాయి. ఇవి ఎలాంటి వాతావరణంలోనైనా పండుతాయి. చీడ, తెగుళ్లు సోకవు, రసాయన ఎరువుల అవసరం తక్కువ. ఇవి జీవవైవిధ్య, వాతావరణ అనుకూల పంటలు. వీటిలో కర్బన అవశేషాలు తక్కువ, నీటి శాతం కూడా తక్కువే. వీటికి అడపాదడపా పడే వానలు సరిపోతాయి అనడం కంటే... కరువు కాటకాలకు తట్టుకొని నిలబడతాయనడం సబబు. చిరుధాన్యాల సాగుకు కొద్దిపాటి పెట్టుబడులు చాలు. అందువల్ల ఇవి చిన్న, సన్నకారు రైతులకు అనుకూలం. ఆర్థికంగా, ఆహార భద్రతాపరంగా మిగిలిన ఇతర ధాన్యాలతో పోలిస్తే ధర చాలా తక్కువ అయినందువల్ల ఒకప్పుడు వీటిని పేదల ఆహారంగా అభివర్ణించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి జాతీయ ఆహారభద్రతా కార్యక్రమం కింద- సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత అన్నీ పెరిగాయి. 2015-–16లో 1.45 కోట్ల టన్నుల ఉత్పత్తి ఉండగా, 2020–21లో1.79 కోట్లకు పెరిగినట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటికి డిమాండ్ పెరుగుతుండటంతో ఎగుమతులు కూడా భారీగా ఉంటున్నాయి. అలాగే వ్యాపార అవకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఏడాదికి 170 లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తితో భారత్​ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్నది. ప్రపంచ ఉత్పత్తిలో 20% మనదే. ఆసియాలో అయితే 80% వాటా మనదే. ప్రపంచ సగటు ఉత్పత్తి హెక్టారుకు1229 కిలోలు కాగా, మన దేశంలో అది1239 కిలోలుగా ఉంది. కరోనా తర్వాత చిరుధాన్యాల వినియోగంపై ఆసక్తి మళ్లీ మొదలైంది. రెండేండ్ల నుంచి క్రమంగా వాటికి ఆదరణ పెరుగుతోంది. కాల్షియం, జింకు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, విటమిన్, ఐరన్, ఫొలేట్, కార్బొహైడ్రేట్, మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ వంటివి ఉన్నందున చిరుధాన్యాలను పోషకాల గనిగా  పిలుస్తాము. వీటిలో 7–-12% ప్రొటీన్లు, 2-5% కొవ్వులు, 65-– 75% కార్బొహైడ్రేట్లు, 15-–20% జీర్ణవ్యవస్థకు తోడ్పడే పీచుపదార్థాలు ఉంటాయి. గోధుమల్లో కనిపించే గ్లూటెన్ వీటిల్లో ఉండదు. కాబట్టి గ్లూటెన్ పడని వారికి ఎక్కువగా ఇది ఉపకరిస్తుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్న ఈ రోజుల్లో పోషకాలు, స్వస్థతను అందించే చిరుధాన్యాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. గర్భిణుల పోషకాహార స్థితిపై చిరుధాన్య ఆహార పదార్థాలు సానుకూల ప్రభావం చూపుతాయి. ఆరోగ్యకర శారీరక ప్రక్రియలకు ఎంతో అవసరమైన పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఆహారపు పీచు చిరుధాన్యాల్లో సమృద్ధిగా ఉంటాయి. 

ఆహార అలవాట్లలో భాగం

కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల ప్రాధాన్యతను పెంచే కార్యక్రమాలు చేపడుతున్నది. ప్రజల్లో వీటి ఆరోగ్య ప్రయోజనాల పట్ల అవగాహన కలిగించడానికి, ఉత్పత్తి పెంచడానికి 2018ని ‘జాతీయ చిరుధాన్య సంవత్సరం’గా ప్రకటించింది. వీటికి ఉన్న పోషక విలువలను అందరూ సులభంగా గుర్తించడానికి వీలుగా వీటికి ‘పోషక తృణధాన్యాలు’ గా నామకరణం చేసింది. అదే ఏడాదిలో వీటిని.. ప్రధానమంత్రి పోషణ్ అభియాన్, సంపూర్ణ పోషకాహారం కార్యక్రమాల్లో చేర్చింది. అనుబంధ పోషకాల నాణ్యతను పెంచడానికి స్థానిక ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి తద్వారా పోషకాహార లోపాలను అధిగమించడానికి 2021లో కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ పోషణ్ 2.0’ ను ప్రారంభించింది. ‘పోషణ్ అభియాన్’ కింద దేశమంతటా ఏటా సెప్టెంబరు మాసాన్ని ‘జాతీయ పోషణ మాసం’గా ప్రకటించింది. అంగన్వాడీ సేవల్లో అనుబంధ పోషకాహార కార్యక్రమం కింద అందించే ఆహారంలో చిరుధాన్యాలను చేర్చేవిధంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రోత్సహిస్తున్నది. కనీసం వారానికి ఒకసారి చిరుధాన్య ఆధారిత ఆహారం అందించడాన్ని తప్పనిసరి చేసింది. ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చిరుధాన్యాలను అనుబంధ ఆహారంగా చేర్చాయి. ఇది పాతకాలం నాటి అలవాటు కాదనీ, ఆరోగ్యపరంగా ఆధునిక ఆహారమని, వండటం సులభమని, త్వరగా సిద్ధం చేసుకోవచ్చంటూ దాని పోషకాల ప్రయోజనాలకు కూడా రేడియో, పత్రికలు, సామాజిక మాధ్యమాలు, ఈవెంట్లు, ప్రదర్శనలద్వారా కేంద్రం ప్రచారం కల్పిస్తున్నది. దుబాయ్ ఎక్స్ పో, సూరజ్ కుండ్ మేళా వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో కూడా వీటికి ప్రచారం కల్పిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాని నిర్వహణలోని క్యాంటీన్లలో సమోసాలు, బ్రెడ్ పకోడీల వంటి వేపుళ్ల స్థానంలో చిరుధాన్యాలతో చేసిన రోటీలు, చిల్లాస్(ఊతప్పంలాంటి) పదార్థాలను అందిస్తున్నది.

పంటల సాగుకు ప్రోత్సాహం

చిరుధాన్యాలకు ప్రజాదరణ కల్పించడానికి, దీన్ని ఒక విప్లవాత్మక ఉద్యమంగా మలచడానికి - కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్​లో దేశంలో చిరుదాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ‘శ్రీ అన్న’ యోజనను ప్రారంభించింది. శ్రీ అన్న పరిశోధనకు దేశాన్ని గ్లోబల్ హబ్ గా మార్చేందుకు, హైదరాబాద్​లోని ‘ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ను అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ పరిశోధనలు, సాంకేతికతను పంచుకోవడానికి కేంద్రంగా మార్చబడుతుందని యూనియన్ బడ్జెట్ 2023–-24 హైలైట్ చేసింది. జోవర్, రాగి, బజ్రా, రామదానా, చీనా, సామా వంటి పోషక పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఇతర విషయాలపై ఈ సంస్థ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఈ పోషక మిల్లెట్లను పండించడం ద్వారా భారతీయ పౌరుల ఆరోగ్యానికి తోడ్పడటంతోపాటు, చిన్న, సన్నకారు రైతులకు లాభాన్ని చేకూర్చే దిశగా రాబోయే రోజుల్లో పరిశోధనలు సాగనున్నాయి. దేశాన్ని ఆరోగ్య భారత్ గా తీర్చిదిద్దాలన్న ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా, అది కూడా స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న క్షణాల్లో మన ప్రాచీన వారసత్వాల, సంప్రదాయాల ఆహారపుటలవాట్ల పట్ల అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం జరుగుతున్నది. మన జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పులు తీసుకురావడానికి సమయం ఆసన్నమైంది. చిరు ధాన్యాల వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను అర్థం చేసుకొని, వాటిని మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

- డా. కె. లక్ష్మణ్,
రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు