వాషింగ్టన్: రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కామెంట్లు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి ఇండియా చమురు దిగుమతులను భారీగా తగ్గిస్తుందన్నారు. వైట్‌హౌస్‌లో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ తగ్గింపు క్రమంగా ఉంటుందని, ఇది మంచి చర్య అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇండియా నుంచి తనకు హామీ వచ్చిందని తెలిపారు.
ఈ ప్రాసెస్‌కు కొంత టైమ్ పడుతుందని అన్నారు. కాగా, ఈ విషయంపై ట్రంప్ కొన్ని రోజులుగా సొంత ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఇండియా మాత్రం ట్రంప్ కామెంట్లను ఖండిస్తూ వస్తున్నది. రష్యాకు చెందిన 2 ఆయిల్ కంపెనీలపై తాజాగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో మొన్ననే మాట్లాడారని, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. ‘‘రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతిని తగ్గించుకునేందుకు ఇండియా హామీ ఇచ్చింది. కొనుగోళ్లు.. 40 శాతానికి పడిపోతాయి. ఇండియా తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరు. ఇండియా ఎంతో గొప్ప దేశం. మోదీ గొప్ప నాయకుడు’’అని ట్రంప్ అన్నారు.
