
హాంగ్జౌ: ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్.. ఆసియా గేమ్స్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం మలేసియాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. అయితే బెటర్ ఐసీసీ ర్యాంకింగ్ ప్రకారం టీమిండియాకు సెమీస్ బెర్త్ దక్కింది. వర్షం వల్ల 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో.. టాస్ ఓడిన ఇండియా 173/2 స్కోరు చేసింది. షెఫాలీ వర్మ (39 బాల్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67), జెమీమా రొడ్రిగ్స్ (29 బాల్స్‌లో 6 ఫోర్లతో 47 నాటౌట్) దంచికొట్టారు. తొలి వికెట్‌కు 57 రన్స్ జోడించి స్మృతి మంధాన (27) ఔటైనా, షెఫాలీ, జెమీమా రెండో వికెట్‌కు 86 రన్స్ జత చేశారు.
చివర్లో రిచా ఘోష్ (7 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 21 నాటౌట్) కూడా బ్యాట్ ఝుళిపించింది. జెమీమాతో మూడో వికెట్‌కు 30 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పింది. మలేసియా బౌలర్లలో మహిరా ఇస్మాయిల్, మాస్ ఎలీసా చెరో వికెట్ తీశారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 15 ఓవర్లలో 177 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 0.2 బాల్స్‌లో ఒక రన్ మాత్రమే చేసింది.
హమిజా హషీమ్ (1 నాటౌట్), విన్‌ఫ్రెడ్ (0 నాటౌట్) క్రీజులో ఉండగా భారీ వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగించింది. ఇండోనేసియా, పాకిస్తాన్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయ్యింది. దీంతో పాక్ కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టింది.