1971 యుద్ధం స్వర్ణోత్సవాలు

  1971 యుద్ధం స్వర్ణోత్సవాలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్ తో 1971లో జరిగిన డైరెక్ట్ యుద్ధంలో గెలిచామని, టెర్రరిస్టులను ఉసిగొల్పుతూ ఆ దేశం కొనసాగిస్తున్న ఇన్ డైరెక్ట్ యుద్ధంలోనూ గెలుస్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇండియాను మతం పేరిట విభజించడం ఒక చరిత్రాత్మక తప్పిదం అని ఈ యుద్ధం నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్ తో 1971 యుద్ధంలో గెలిచి ఈ నెల 16 నాటికి 50 ఏండ్లు అవుతున్నందున ఆదివారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘స్వర్ణిమ్ విజయ్ పర్వ్’ పేరిట రెండు రోజుల స్వర్ణోత్సవాలను ప్రారంభించిన అనంతరం రాజ్ నాథ్ మాట్లాడారు. ‘‘టెర్రరిజాన్ని ప్రోత్సహించడం, యాంటీ ఇండియా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా మన దేశాన్ని ముక్కలు చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. కానీ ఆనాటి డైరెక్ట్ యుద్ధంలో మన సాయుధ బలగాలు అన్ని రకాలుగా పాక్ ను ఓడించాయి. ఇప్పుడు ఇన్ డైరెక్ట్ యుద్ధాన్ని కూడా గెలిచి తీరుతాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని అనుకున్నామని, కానీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మరణం కారణంగా నిరాడంబరంగా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణిమ్ విజయ్ పర్వ్ వేడుకల గురించి రావత్ తనతో అనేక విషయాలు చర్చించారని గుర్తు చేసుకున్నారు.