ఏటా కొత్తగా 12 లక్షల మందికి కేన్సర్

ఏటా కొత్తగా 12 లక్షల మందికి కేన్సర్

ఇండియాలో కేన్సర్ రోగం రోజూ1,300 మందిని బలి తీసుకుంటోందట. ఏటా కొత్తగా12 లక్షల మందికి కేన్సర్ వస్తోందట. ఫ్రాన్స్ లోని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్ సీ) అంచనా ప్రకారం, 2030 నాటికి మనదేశంలో ఏటా కొత్తగా17 లక్షల కేన్సర్ కేసులు నమోదు కావచ్చట. అందుకే.. ఇప్పటికిప్పుడు దీనికి అడ్డుకట్ట వేయకుంటే.. త్వరలోనే ఇండియాను కేన్సర్ సునామీ ముంచేయక తప్పదని అమెరికాకు చెందిన ప్రముఖ తెలుగు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఎన్ఆర్ఐ డాక్టర్ రేఖా భండారీ హెచ్చరిస్తున్నారు. మనదేశంలో కేన్సర్ వ్యాధికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి గురించి వారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశారు. కేన్సర్ నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.

గుర్తింపు, అవగాహనే ముఖ్యం..

కేన్సర్​ను కట్టడి చేయాలంటే ఆ రోగాన్ని తొలిదశలోనే గుర్తించాలని, అప్పుడే రోగాన్ని ఈజీగా నయం చేయొచ్చని దత్తాత్రేయుడు స్పష్టం చేశారు. అలాగే డాక్టర్లకు, ప్రజలకు దీనిపై అవగాహన పెంచాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా భారీ చర్యలు తీసుకోవాలన్నారు. కేన్సర్ రోగాన్ని తొలిదశలోనే గుర్తించకపోవడం వల్ల అది ముదిరిపోయి, ప్రాణాంతకంగా మారుతోందని, అలాగే దేశంలో సరైన ట్రీట్​మెంట్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారిందని ఆయన తెలిపారు. ఈ రెండు విషయాల్లో వెంటనే చర్యలు తీసుకుంటే తప్ప కేన్సర్ సునామీని అడ్డుకోవడం సాధ్యం కాదన్నారు.

పొగాకే ప్రధాన కారణం

దేశంలో వివిధ రకాల కేన్సర్ రోగాలకు పొగాకు వాడకమే ప్రధాన కారణమని డాక్టర్ దత్తాత్రేయుడు తెలిపారు. అందుకే కేన్సర్​ను నోటిఫయేబుల్ డిసీజ్ కేటగిరీలో చేర్చాలని తాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు వెల్లడించారు. ఐటీ, బ్లాక్​చైన్, ఏఐ వంటి టెక్నాలజీలను వాడుకుంటే కేన్సర్​ను తొలిదశలోనే గుర్తించడం మరింత ఈజీ అవుతుందని ఆయన చెప్పారు.

పదేళ్లలో కేన్సర్​ను జయించొచ్చు..

ప్రస్తుతం పేద కుటుంబాల్లో ఎవరికైనా కేన్సర్ వస్తే.. ఆ కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా చితికిపోతోందని దత్తాత్రేయుడు అన్నారు. దీనివల్ల పరోక్షంగా పేదరికం, అసమానతలు ఇంకా పెరుగుతున్నాయని చెప్పారు. రోగాన్ని గుర్తించేందుకు చేసే టెస్టులు, ట్రీట్ మెంట్​కు అయ్యే ఖర్చు ఇప్పటికీ చాలామందికి తలకు మించిన భారం అవుతోందన్నారు. అయితే, ప్రధాని మోడీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్, నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాంలు తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు. కేన్సర్ ను ముందుగా గుర్తించి, ట్రీట్​మెంట్ చేయడం, హెల్త్ ఎడ్యుకేషన్​ను మెరుగుపర్చడం వల్లే దీనిని జయించొచ్చని డాక్టర్ రేఖా భండారీ అన్నారు. ఈ చర్యలు తీసుకుంటే.. పదేళ్లలోనే ఈ రోగం తగ్గుముఖం పడుతుందన్నారు.  ప్రస్తుతం ఇండియా ఎక్కువ మంది యువతతో యంగ్ కంట్రీగా ఉందన్నారు. కానీ.. మరో 20 ఏండ్లలో ఇండియా ప్రపంచంలోనే వృద్ధులు ఎక్కువున్న దేశంగా నిలుస్తుందన్నారు.

కేన్సర్ రీసెర్చ్ లో మేటి డాక్టర్లు

నోరి దత్తాత్రేయుడు అమెరికాలో స్థిరపడిన తెలుగు డాక్టర్. కేన్సర్ రీసెర్చ్, ట్రీట్​మెంట్​లో ప్రపంచంలోనే టాప్ ఆంకాలజిస్టులలో ఒకరిగా పేరు పొందారు. దివంగత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మొదలుకొని ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులకు విజయవంతంగా ట్రీట్ మెంట్ చేశారాయన. ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2015లో పద్మశ్రీ అవార్డును అందజేసింది. ఇక రేఖా భండారి కూడా అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ డాక్టర్. ఈమె జెరియాట్రిక్స్ (వృద్ధుల హెల్త్), పెయిన్ మెడిసిన్ లో ఎక్స్ పర్ట్. ఈమె కేన్సర్ రీసెర్చ్ లోనూ కీలకంగా కృషి చేశారు. ఇద్దరూ అమెరికా ప్రభుత్వం వలస పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ఎలిస్ ఐలాండ్ మెడల్ హానర్ అందుకున్నారు.