నిర్మల్ డాక్టర్ కు ఇండియన్ ఆర్మీ ప్రశంస

నిర్మల్ డాక్టర్ కు ఇండియన్ ఆర్మీ ప్రశంస

నిర్మల్, వెలుగు: రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ ఆర్మీ మేజర్ కుటుంబసభ్యులకు వైద్యం అందించిన డాక్టర్ దేవేందర్ రెడ్డి సేవలను ఇండియన్ ఆర్మీ ప్రశంసించింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​లో విధులు నిర్వహించే ఆర్మీ మేజర్ జబల్ పూర్ కు బదిలీ అయ్యారు. తన కుటుంబసభ్యులతో కలిసి నిర్మల్ మీదుగా వెళ్తుండగా కొండాపూర్ బ్రిడ్జి వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

 ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్ లోని దేవేందర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్ దేవేందర్ రెడ్డి వారికి చికిత్స అందించారు. ఆయన సేవలను మేజర్ ద్వారా తెలుసుకున్న ఆర్మీ రికార్డ్స్ అధికారి సోనా రామ్ నిర్మల్​పోలీసులకు ప్రశంసాపత్రాన్ని పంపించారు. దాన్ని డాక్టర్​కు అందించాలని కోరగా.. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సబ్ డివిజినల్ కార్యాలయంలో ఏఎస్పీ రాజేశ్​మీనా అందజేశారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, రూరల్ ఎస్సై లింబాద్రి ఉన్నారు.