దుమ్మురేపిన అమ్మకాలు..2.20 లక్షల యూనిట్లు అమ్మిన మారుతి

దుమ్మురేపిన అమ్మకాలు..2.20 లక్షల యూనిట్లు అమ్మిన మారుతి
  • రెండోస్థానంలో హ్యుందాయ్
  • కలిసి వచ్చిన జీఎస్టీ 2.0, పండుగ డిమాండ్​

న్యూఢిల్లీ: పండుగ సీజన్ డిమాండ్,  బలమైన వినియోగదారుల సెంటిమెంట్ కారణంగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ గత నెల బలమైన వృద్ధిని సాధించింది.  జీఎస్టీ 2.0 కారణంగా బండ్ల ధరలు బాగా తగ్గడం కూడా కంపెనీలకు కలిసి వచ్చింది. 

ఆటో తయారీ సంస్థలైన మారుతి, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్, టయోటా కిర్లోస్కర్, కియా ఇండియా అన్నీ ముఖ్య విభాగాలలో గత సంవత్సరంతో పోలిస్తే భారీగా అమ్మకాలను సాధించాయి.  మనదేశంలోనే అతిపెద్ద ఆటో కంపెనీ మారుతి రికార్డుస్థాయిలో కార్లను అమ్మింది. 

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్:

మొత్తం 2,20,894 యూనిట్లతో మారుతీ సుజుకి తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించింది. దేశీయ అమ్మకాలు 1,80,675 యూనిట్లతో ఆల్​టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. ఇది గత ఏడాది అక్టోబరులో 2.06 లక్షల యూనిట్లను అమ్మింది. వార్షికంగా అమ్మకాలు ఏడు శాతం పెరిగాయి.  ఇతర ఓఈఎమ్​లకు అమ్మకాలు 8,915 యూనిట్లు, ఎగుమతులు 31,304 యూనిట్లుగా ఉన్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్): మొత్తం 1.2 లక్షల యూనిట్ల ఆటో అమ్మకాలు నమోదు కాగా, ఇది అంచనాలకు అనుగుణంగా 26 శాతం వార్షికంగా వృద్ధిని సాధించింది. ఎస్​యూవీలకు కొనసాగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌తో దేశీయ పీవీల అమ్మకాలు 31 శాతం పెరిగి 71,624 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 15 శాతం, త్రీ-వీలర్ల అమ్మకాలు 30 శాతం పెరిగాయి.

టీవీఎస్ మోటార్ కంపెనీ: మొత్తం 5.43 లక్షల యూనిట్ల విక్రయాలను సాధించి, అంచనాలను అధిగమించింది. ఇది గత సంవత్సరం 4.89 లక్షల యూనిట్లను అమ్మింది. వార్షికంగా అమ్మకాలు 11 శాతం పెరిగాయి. టూ-వీలర్ల అమ్మకాలు 10 శాతం పెరిగి 5.25 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఈవీల అమ్మకాలు 11 శాతం పెరిగి 32,387 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు 21 శాతం పెరిగాయి. త్రీ-వీలర్ల అమ్మకాలు 70 శాతం పెరిగాయి.

కియా ఇండియా: ఈ సంస్థ 29,556 యూనిట్లతో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసి, 30 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. సోనెట్ 12,745 యూనిట్లతో అమ్మకాల్లో ముందుంది. కేరెన్స్ క్లావిస్, కేరెన్స్ క్లావిస్ ఈవీ (8,779 యూనిట్లు), సెల్టోస్ (7,130 యూనిట్లు) మంచి అమ్మకాలు నమోదు చేశాయి.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్

ఈ సంస్థ మొత్తం 69,894 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఇందులో 53,792 దేశీయ యూనిట్లు, 16,102 ఎగుమతులు ఉన్నాయి. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈసారి ఎగుమతుల్లో 11 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీ ఎస్​యూవీలైన క్రెటా, వెన్యూ కలిపి 30,119 యూనిట్లతో తమ రెండో అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించాయి.