
న్యూఢిల్లీ: విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియన్ బాక్సర్ల పంచ్ అదురుతోంది. తెలంగాణ స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహైన్, సావిటీ బూరా, నీతూ గంగాస్ ఫైనల్లోకి దూసుకెళ్లి గోల్డ్ మెడల్‌కు అడుగు దూరంలో నిలిచారు. గురువారం జరిగిన విమెన్స్ 50 కేజీ సెమీస్‌లో నిఖత్ 5–0తో రియో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ ఇంగ్రిట్ వాలేన్సియా (కొలంబియా)పై గెలిచింది. ఏకపక్షంగా సాగిన బౌట్‌లో ఇండియన్ బాక్సర్ స్పీడ్‌తో పాటు కచ్చితమైన పంచ్‌లతో విరుచుకుపడింది.
విమెన్స్ 48 కేజీ సెమీస్‌లో నీతూ గంగాస్ 5–2తో అలువా బాల్కిబెకోవా (కజకిస్తాన్)ను ఓడించి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది. ఆరంభంలో ఆధిపత్యం చూపెట్టిన కజక్ బాక్సర్ 3–2 లీడ్‌లో నిలిచింది. కానీ చివరి మూడు నిమిషాల్లో అద్భుతంగా పుంజుకున్న నీతూ స్ట్రయిట్, హుక్ పంచ్‌లతో చెలరేగింది. 75 కేజీ సెమీస్‌లో లవ్లీనా 4–1తో లి క్వియాన్ (చైనా)ను ఓడించగా, 81 కేజీ బౌట్‌లో సావిటీ బూరా 4–3తో సు ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేసి ఫైనల్‌కు అర్హత సాధించారు.