చందమామ ఇంటికి మన ఇటుక

చందమామ ఇంటికి మన ఇటుక

చందమామను అందుకోవాలి.. అక్కడ ఇళ్లు కట్టాలి.. ప్రయోగాలు చేయాలి.. మనకు అనుకూలంగా మార్చుకోవాలి..’ ఇదీ జాబిల్లిపై దృష్టి పెట్టిన దేశాలు అనుకుంటున్న మాట. ఆలోచనైతే బాగానే ఉంది కానీ, అక్కడ ఇళ్లు కట్టాలంటే, ఆ వాతావరణానికి సరిపోయే సిమెంట్​ తయారు చేసుకోవాలి. గోడలు నిలబడాలంటే గట్టిగా ఉండే ఇటుకలు కావాలి! మరి, వాటి సంగతేంటి? సిమెంట్​ సంగతేమోగానీ, ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ (ఐఐఎస్​సీ) సైంటిస్టులు మాత్రం ఓ మాంచి ‘ఇటుక’ను తయారు చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో జట్టుకట్టి ‘స్పేస్​బ్రిక్​’ను చేసి చూపించారు.

చందమామ మట్టి లాంటి మట్టితో..

ఐఐఎస్​సీలోని మెకానికల్​ ఇంజనీరింగ్​ డిపార్ట్​మెంట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ అలోక్​ కుమార్​ నేతృత్వంలోని టీమ్​ ఆ ఇటుకకు రూపమిచ్చింది. చందమామపై ఉండే మట్టి లాంటి ఓ మట్టిని (లూనార్​ సాయిల్​ సిమ్యులెంట్​– ఎల్​ఎస్​ఎస్​)ను ఇస్రో తయారు చేసింది. అపోలో మిషన్​లో భాగంగా నాసా సైంటిస్టులు చందమామ నుంచి తెచ్చిన శాంపిళ్లతో మన సైంటిస్టులు తయారు చేసిన మట్టి 99.6 శాతం వరకు సరిపోలింది. ప్రస్తుతం ఇస్రో దగ్గర 60 టన్నుల ఎల్​ఎస్​ఎస్​ ఉందట. ఆ మట్టితోనే జాబిల్లిపై ‘ఇగ్లూ’లను కట్టేందుకు ఇస్రో రెడీ అయింది. అయితే, ఆ ప్రాజెక్టుకు ఇంకా బడ్జెట్​ ఓకే చేయలేదు.

బ్యాక్టీరియాతో సహజంగా

ఓ మామూలు ఇటుక తయారు చేయాలంటే బంకమట్టో లేదంటే సిమెంటో కావాలి. కానీ, ఐఐఎస్​సీ సైంటిస్టులు మాత్రం బ్యాక్టీరియాను వాడుకున్నారు. దాన్నే బయోసిమెంటేషన్​ టెక్నాలజీ అని పిలుస్తున్నారు. ఎవరి ప్రమేయం లేకుండా ఇటుక దానంతట అదే తయారు కావాలన్న ఉద్దేశంతో ఈ టెక్నాలజీని సైంటిస్టులు ఎంచుకున్నారు. అంటే ఇటుక తయారవడానికి కావాల్సిన కాల్షియం కార్బొనేట్​ను సహజంగా తయారు చేయడం. అయితే, అన్ని బ్యాక్టీరియాలూ ఈ టెక్నాలజీకి సరిపోవు. అందుకే స్పోరోసార్సినా పాశ్చురీ అనే బ్యాక్టీరియాను ఇందుకోసం సైంటిస్టులు ఎంపిక చేసుకున్నారు. ఆ బ్యాక్టీరియాను ఇస్రో తయారు చేసిన ఎల్​ఎస్​ఎస్​ పౌడర్​తో కలిపారు. కాల్షియం కార్బొనేట్​ పుట్టి ఇటుక తయారు కావడానికి సరైన వాతావరణాన్ని కల్పించారు. అంతే 15 నుంచి 20 రోజుల్లో స్పేస్​ ఇటుక తయారైపోయింది. అయితే, ఫస్ట్​ బ్యాచ్​లో తయారు చేసిన ఇటుకలు అంత గట్టిగా లేవు. జస్ట్​ చేతితో పగులగొట్టేంత బలహీనంగా ఉన్నాయి. దాన్ని అధిగమించేందుకు సైంటిస్టులు దానికి కొంచెం గ్వార్​ గమ్​ (గోకరకాయ బంక)ను కలిపారు. దీంతో ఇటుక మరింత గట్టిగా తయారైంది. ఫస్ట్​ తయారు చేసిన ఇటుకలతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ దృఢంగా ఉన్నాయి.

చందమామ వాతావరణానికి సరిపోతదా?

నిజానికి అన్ని జీవులు అన్ని వాతావరణాల్లో బతకలేవు. మరి, సైంటిస్టులు వాడిన బ్యాక్టీరియా చందమామ వాతావరణాన్ని తట్టుకోగలుగుతుందా? అంటే.. దానిపైనే మరిన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని అలోక్​ కుమార్​ చెబుతున్నారు. ‘‘వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు జీవుల ప్రవర్తన మారుతూ ఉంటుంది. కాబట్టి చందమామ వాతావరణానికి మేం వాడిన టెక్నాలజీ సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది. తక్కువ గురుత్వాకర్షణ శక్తి వద్ద ఇటుకను టెస్ట్​ చేస్తాం. అందుకు అవసరమైన స్పేస్​ వాతావరణాన్ని సృష్టిస్తాం’’ అని చెప్పారు. ముందుగా ల్యాబ్​లోనే మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో ఇటుకను టెస్ట్​ చేస్తామని, ఆ తర్వాత స్పేస్​లో పరీక్షిస్తామని అన్నారు. అందుకోసం కొన్ని పేలోడ్​ డిజైన్లను ఆయన టీమ్​ ప్రతిపాదించింది. చందమామపై మనిషికి అనుకూలంగా ఉండే ఇళ్లను కట్టేందుకు తాము ప్రతిపాదించిన డిజైన్లు ఉపయోగపడతాయన్నారు. ఈ స్పేస్​ బ్రిక్​ ప్రాజెక్ట్​ను రెండున్నరేళ్ల క్రితమే ప్రారంభించామని అలోక్​ చెప్పారు.