అందరినీ అక్కున చేర్చుకోవడమే భారతీయ సంస్కృతి : విద్యాసాగర్​రావు

అందరినీ అక్కున చేర్చుకోవడమే భారతీయ సంస్కృతి : విద్యాసాగర్​రావు
  • శ్యామ్​సుందర్​రావు దంపతులు అందరికీ ఆదర్శం: వివేక్ ​వెంకటస్వామి

మంచిర్యాల, వెలుగు: వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని.. కులమతాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరినీ ఆదరించి అక్కున చేర్చుకోవడమే భారతీయ సంస్కృతి గొప్పదనమని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్​నేత సీహెచ్ విద్యాసాగర్​రావు అన్నారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మనదేశం వైపు చూస్తున్నాయన్నారు. బీజేపీ సీనియర్​ లీడర్, ఐకార్​ మెంబర్​ గోనె శ్యామ్​సుందర్​రావు ఆధ్వర్యంలో మంచిర్యాలలోని పద్మావతి గార్డెన్స్​లో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాసాగర్​రావు మాట్లాడుతూ.. హిందూయిజం, హిందుత్వ భావనలు వేర్వేరు కాదన్నారు. భారతీయ సంస్కృతి కేవలం హిందువులదనే సంకుచిత భావన సరికాదని, దేశంలో వివిధ పార్టీలు, కులాలు, మతాలు ఉన్నా అందరిదీ భారతీయ సంస్కృతే అని ఆరుసార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చాయని ఆయన గుర్తుచేశారు. త్రిపురలో మెజారిటీ క్రైస్తవులు ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తాము కూడా భారతీయ సంస్కృతిలో భాగమేనని వారు చాటి చెప్పారన్నారు. ఇండోనేషియాలో 88% ముస్లింలు, 2 శాతమే హిందువులు ఉన్నప్పటికీ.. అక్కడ కరెన్సీ నోట్లపై వినాయకుని ఫొటో ముద్రిస్తారని, ఇలాంటిదే మన దేశంలో జరిగితే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతాయన్నారు. శతాబ్దాల కిందట ఇండియాకు వచ్చి స్థిరపడ్డ ఇజ్రాయెల్​ వాసులు ఇక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. 

ఉద్యమంలో కలిసి పనిచేసినం: వివేక్ ​వెంకటస్వామి

తన తండ్రి వెంకటస్వామి హయాం నుంచి శ్యామ్​సుందర్​రావుతో తమకు అనుబంధం ఉందని వివేక్​ వెంకటస్వామి అన్నారు. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయాలని పట్టుబట్టారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేయడం మర్చిపోలేనన్నారు. శ్యామ్​సుందర్​రావు దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు డైరెక్టర్​ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. శ్యామ్​సుందర్​రావు ఉద్యమం సమయంలో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సాధించాలనే ధృడ సంకల్పంతో పనిచేశారని ప్రశంసించారు. 1978 నుంచి నేటి వరకు సంఘ్​ జీవనంలో, రాజకీయాల్లో తనకు అండగా నిలిచిన నాయకులకు శ్యామ్​సుందర్​రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వనవాసీ కల్యాణ పరిషత్ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి కురిగింజ రామచంద్రయ్య, ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ వేణుగోపాల్​రెడ్డి, కరీంనగర్ విభాగ్ సంఘ్​ చాలక్ మల్లోజుల కిషన్​రావు, మాజీ ఎంపీ రమేశ్​ రాథోడ్, గుజ్జుల రామకృష్ణారెడ్డి, ముల్కల్ల మల్లారెడ్డి, బల్మూరి అనిత తదితరులు పాల్గొన్నారు.