కామన్‌వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భవానీ దేవికి స్వర్ణం

కామన్‌వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భవానీ దేవికి స్వర్ణం

కామన్‌వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి స్వర్ణ పతకం సాధించింది. ప్రపంచ 42వ ర్యాంక్‌లో ఉన్న భారత ఫెన్సర్ ..సీనియర్ మహిళల సాబెర్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో రెండో సీడ్ ఆస్ట్రేలియా స్టార్ ఫెన్సర్ వెరోనికా వాసిలేవాను 15-10తో ఓడించింది. పసిడి పతకంతో  భవానీ దేవి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే మొదటి భారతీయ ఫెన్సర్‌గా భవానీ దేవి రికార్డు సృష్టించనుంది. కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భవానీ దేవికి ఇది రెండో స్వర్ణం. 2019లోనూ ఆమె స్వర్ణం గెలిచింది. 

కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ లో స్వర్ణం సాధించడంపై భవానీదేవి సంతోషం వ్యక్తం చేసింది. ఫైనల్లో గెలిచేందుకు తీవ్రంగా కష్టపడ్డానని..చివరకు గోల్డ్ గెలిచినందుకు ఆనందంగా ఉందని వెల్లడించింది. గోల్డ్ మెడల్ తో ఒలింపిక్స్ కు అర్హత పొందడం తన ఆనందాన్ని రెట్టింపు చేస్తోందని పేర్కొంది. ఇదే జోరును  రాబోయే రోజుల్లోనూ కొనసాగించాలనుకుంటున్నానని తెలిపింది. 

కామన్వెల్త్ గేమ్స్ 2022 ఆగస్టు 8న ముగియగా లండన్ వేదికగా  కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ 2022 పోటీలు ఆగస్టు 9న మొదలయ్యాయి. ఆగస్టు 20 వరకూ సాగే గేమ్స్ లో ఇండియా నుంచి సీఏ భవానీ దేవీ, మోహిత్ మహేంద్ర, రాజీవ్ మెహతా, తనిక్ష కత్రీ,కరణ్ సింగ్ పాల్గొంటున్నారు. 2019లో భారత్‌ నుంచి భవానీ దేవీతో పాటు భారత పురుషుల సేబర్ టీమ్ ఛాంపియన్‌షిప్ ను దక్కించుకుంది. భారత ఫెన్సర్ కరణ్ సింగ్‌కి కాంస్య పతకం దక్కింది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున బరిలో దిగిన భవానీ దేవీ... తొలి రౌండ్‌లో సంచలన విజయం అందుకుంది. అంతేకాదు రెండో రౌండ్‌లో ప్రవేశించిన మొట్టమొదటి భారత ఫెన్సర్‌గా భవానీదేవి చరిత్రకెక్కింది. రెండో రౌండ్‌లో వరల్డ్ నెంబర్ 3 ఫెన్సర్ మనన్ బ్రునెట్‌ చేతిలో పరాజయం పాలైంది.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన భవానీ దేవి.. ఫెన్సింగ్‌లో 8 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఫెన్సింగ్‌లో ప్రాతినిధ్యం వహించిన ఏకైక అథ్లెట్ భవానీ దేవీయే కావడం విశేషం.