Ambati Rayudu: వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా.. తెరవెనుక జరిగింది ఇదేనా!

Ambati Rayudu:  వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా.. తెరవెనుక జరిగింది ఇదేనా!

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపిన రాయుడు.. కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో జాయిన్ అయిన తొమ్మిది రోజులకే రాయుడు రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది.  

రాజకీయాల కోసమే ఐపీఎల్ కి దూరం

భారత క్రికెటరైన రాయుడు రాజకీయాల కోసమే ఐపీఎల్‌కి దూరమయ్యాడు. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఎన్నోసార్లు చెప్పిన రాయుడు.. గతేడాది ప్రారంభంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం వైసీపీ తరుపున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే గత నెల డిసెంబర్ 28న అధికారికంగా వైసీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అలాంటిది రాయుడు తొమ్మిది రోజులకే పార్టీ వీడడం పలు అనుమానాలకు తావిస్తోంది.

పొన్నూరు  vs గుంటూరు

గుంటూరు ఎంపీ సీటు లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ విషయంలో చర్చలు జరిగాయి. జగన్ మాత్రం గుంటూరు ఎంపీ సీటు వైపే మొగ్గుచూపారు. రాయుడు మాత్రం పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. పొన్నూరు నియోజకవర్గం పరిధిలోనే అంబటి రాయుడు సొంతూరు వస్తుంది. టికెట్ కన్ఫామ్ అయినా.. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల విషయంలో పార్టీతో కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. గుంటూరుకు చెందిన కొంత మంది రాజకీయ నేతలు.. అంబటి రాయుడితో టచ్ లోకి వెళ్లారు. ఎంపీ వద్దని.. ఎమ్మెల్యే సీటు అయితే బెటర్ అంటూ బ్రెయిన్ వాష్ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన సీఎం జగన్.. స్వయంగా తన క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడారు. 

ఈ సమయంలోనే.. పార్టీలోని కొందరు నేతలు, ప్రత్యర్థి టీడీపీ నేతల అభిప్రాయాలను సైతం అంబటి రాయుడు.. సీఎం జగన్ ద్రుష్టికి తీసుకెళ్లారు. రాజకీయాలు అన్నాక ఇలాంటివి చాలా ఉంటాయని.. రాబోయే రోజుల్లో ఇంకా ఉంటాయని.. అలాంటి విషయాల్లో సున్నితంగా ఉంటే కుదరదని.. తెగింపు ఉండాలని.. రాజకీయం అన్నాక కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని.. ప్రత్యర్థి పార్టీలు నీరుగారుస్తూ ఉంటాయని.. వాళ్ల మాటలు పట్టించుకోవద్దంటూ హితబోధ చేశారు సీఎం జగన్. ఇదే సమయంలో సొంత పార్టీలోని కొందరు నేతల వ్యవహారశైలిపైనా చర్చ జరిగింది. అన్ని విషయాలను విన్న జగన్.. అప్పటికప్పుడే పార్టీ జెండా మెడలో వేసి.. పార్టీలో చేరినట్లు సంకేతాలు పంపించేశారు. 

అంబటి రాయుడును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఇప్పటిది కాదు.. రెండేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. కీలకమైన సమయంలో.. పార్టీ టికెట్ కన్ఫామ్ అవుతున్న సమయంలో.. వైసీపీ జెండా కప్పుకున్న తర్వాత.. అంబటి రాయుడు రాజకీయాలకు దూరం అంటూ ట్విట్ చేయటం సంచలనంగా మారింది. ఈ విషయంపై రాయుడు వెర్షన్ కనుక్కునేందుకు ప్రయత్నిస్తే.. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ ఫోన్లు ఆఫ్ చేయటం విశేషం. అంబటి రాయుడు పొలిటికల్ విషయాలను దగ్గరుండి చూసుకుంటున్న అతని బంధువులు సైతం అందుబాటులోకి రావటం లేదు. దీంతో ఏమైంది అనేది ఆసక్తిగా మారింది.