న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్టార్ షూటర్ ఇషా సింగ్ మరో రెండు మెడల్స్‌తో మెరిసింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్, వ్యక్తిగత విభాగంలో కాంస్యంతో సత్తా చాటింది. సోమవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఇషా సింగ్, మను భాకర్, రిథమ్ సాంగ్వాన్‌తో కూడిన ఇండియా 1,751 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌తో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. చైనీస్ తైపీ (1,735) రజతం, వియత్నాం (1,729) కాంస్యం సాధించాయి.
ఉత్కంఠగా సాగిన వ్యక్తిగత విభాగం ఫైనల్లో మను భాకర్, వియత్నాం షూటర్ ఎన్‌గుయెన్ తుయ్ ట్రాంగ్ ఇద్దరూ చెరో 35 పాయింట్లతో సమంగా నిలిచారు. షూటాఫ్‌లో ట్రాంగ్ తన ఏకాగ్రతను నిలబెట్టుకుని స్వర్ణాన్ని ముద్దాడగా, మను రజత పతకాన్ని సాధించింది.
మరోవైపు ఎనిమిదో సిరీస్ వరకు 30 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఇషా సింగ్, తొమ్మిదో సిరీస్‌లో ఒక్క పాయింట్ కూడా సాధించలేక మూడో స్థానంతో కాంస్యానికి పరిమితమైంది. 25 మీటర్ల పిస్టల్ జూనియర్ విభాగంలో యంగ్ షూటర్ నామ్యా కపూర్ గోల్డ్, వెటరన్ అంజలి భగవత్ బ్రాంజ్ గెలుచుకోగా.. టీమ్ ఈవెంట్‌లో ఇండియా స్వర్ణం సాధించింది.
