
- ఆర్మీలో బ్రిటిష్ విధానాలకు చెక్
- యూనిఫామ్, పేర్లు, రెజిమెంట్లను మార్చేందుకు చర్యలు
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి వలసవాద సంప్రదాయానికి ఇండియన్ ఆర్మీ చెక్ పెట్టనుంది. బ్రిటిష్ పాలకుల హయాంలో ఆర్మీలో స్థాపించిన రెజిమెంట్లు, యూనిట్ల పేర్లకు స్వస్తి పలకనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు జనరల్ మనోజ్ పాండే ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. ‘‘బ్రిటిష్ పాలకుల కాలం నుంచి ఇండియన్ ఆర్మీలో ఉన్న ఆచారాలు, సంప్రదాయాలపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆర్మీ యూనిఫాంలు, ఆయుధాలు, నిబంధనలు, చట్టాలు, విధానాలు, యూనిట్ ఎస్టాబ్లిష్ మెంట్లలో మార్పులు తేవడానికి, కొన్ని యూనిట్లకు పెట్టిన ఇంగ్లిష్ పేర్లను మార్చడం, బిల్డింగులు, రోడ్లు, పార్కులకు కొత్త పేర్లు పెట్టడంపై సమీక్ష చేస్తున్నం” అని ఆర్మీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పురాతన కాలం నుంచి ఉన్న అసమర్థ బ్రిటిష్ వలసవాద సంప్రదాయాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని ఆఫీసర్లు పేర్కొన్నారు.
నేషనల్ సెంటిమెంట్ కు అనుగుణంగా బ్రిటిష్ ఆచారాల మార్పుపై సమీక్ష చేస్తామని వెల్లడించారు. స్వాతంత్ర్యానికి ముందున్న థియేటర్లు, ఆర్మీ యూనిట్లకు బ్రిటిష్ పాలకులు ఇచ్చిన అవార్డులు (భారత రాష్ట్రాలను, స్వాతంత్ర్య పోరాటాలను అణచివేసినందుకు ఈ అవార్డులు ఇచ్చారు), మిలటరీ వేడుకలు, రెజిమెంట్ వ్యవస్థ, యూనిట్లలో పేర్లు, చిహ్నాల మార్పు, బ్రిటిష్ హయాం నుంచి ఆర్మీలో అనుసరిస్తున్న హెయిర్ కట్ స్టైల్ వంటి అంశాలపైనా రివ్యూ చేస్తున్నామని ఆఫీసర్లు వివరించారు.