నేవీలో 3 వేల మంది అగ్నివీర్​లు

నేవీలో 3 వేల మంది అగ్నివీర్​లు
  • నేవీలో 3 వేల మంది అగ్నివీర్​లు
  • నావల్ స్టాఫ్ చీఫ్​ అడ్మిరల్ హరి కుమార్ వెల్లడి
  • 2047 లోపు ఆత్మనిర్భర్  సాధిస్తామని ధీమా

న్యూఢిల్లీ: నేవీలో ఇప్పటి వరకు మూడువేల మంది అగ్నివీర్ లను నియమించామని, వారిలో 341 మంది మహిళా  నావికులు ఉన్నారని నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ తెలిపారు. నేవీ దినోత్సవానికి ఒకరోజు ముందు ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. 2047 లోపు నేవీలో ఆత్మనిర్భర్ (స్వయంసమృద్ధి) సాధిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చామని ఆయన తెలిపారు. ఆత్మనిర్భర్ పై కేంద్రం ఇదివరకే తమకు గైడ్ లైన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇండియన్  ఓషియన్  ప్రాంతంలో ఎప్పటికపుడు చైనా మిలటరీ, దాని నౌకల కదలికలపై నిఘా వేసి ఉంచామని వెల్లడించారు. ‘‘ఇండియన్ ఓషియన్ ప్రాంతం (ఐవోఆర్) లో చైనాకు చెందిన చాలా షిప్ లు విధులు నిర్వహిస్తున్నాయి.

వాటిలో 46 పీపుల్స్  లిబరేషన్  ఆర్మీవి కాగా, మరికొన్ని రీసర్చ్ షిప్​లు.  ఈ నేపథ్యంలో ఐవోఆర్​లో అదనపు బలగాలను మోహరిస్తున్నాం. ఈ ప్రాంతం రవాణాకు కీలకమన్న విషయం మాకు తెలుసు. ఈ ప్రాంతంలో మన దేశ ప్రయోజనాలు కాపాడడం, ప్రమోట్  చేయడమే మాకు ముఖ్యం” అని హరి కుమార్  వ్యాఖ్యానించారు. తీర ప్రాంత రక్షణ విషయంలో యుద్ధ సన్నద్ధతపై తమకు స్పష్టత ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై మాట్లాడుతూ.. రక్షణ అవసరాల కోసం ప్రపంచంపై ఆధారపడలేమన్నారు. గత ఏడాది కాలంలో మన దేశ నేవీ సత్తా పెరిగిందని, తీర ప్రాంత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఎయిర్ క్రాఫ్ట్  క్యారియర్ ఐఎన్ఎస్  విక్రాంత్ ను నేవీలో ప్రవేశపెట్టడం మైలురాయి అని పేర్కొన్నారు.