అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య.. మోటెల్ యజమాని రాకేశ్ను కాల్చి చంపిన దుండగుడు

అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య.. మోటెల్ యజమాని రాకేశ్ను కాల్చి చంపిన దుండగుడు
  • గొడవ గురించి అడగడంతో పాయిట్ బ్లాంక్ రేంజ్​లో కాల్పులు 

పెన్సిల్వేనియా: 
అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. తన మోటెల్‌‌ బయట జరుగుతున్న వివాదాన్ని ఆపేందుకు వెళ్లిన ఆయనపై నిందితుడు కాల్పులు జరపడంతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

భారత సంతతికి చెందిన రాకేశ్ ఎహగబన్ (51) పిట్స్‌‌ బర్గ్‌‌ లోని రాబిన్సన్‌‌ టౌన్‌‌ షిప్‌‌ లో మోటెల్‌‌ నడుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం మోటెల్‌‌ బయట గొడవ జరగడంతో దాన్ని ఆపేందుకు ఆయన బయటకు వెళ్లారు. ఎందుకు గొడవ పడుతున్నారని రాకేశ్‌‌ అడగడంతో నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో పాయింట్‌‌ బ్లాంక్‌‌ రేంజ్‌‌లో ఆయనను కాల్చాడు. దీంతో రాకేశ్‌‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మోటెల్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

సమాచారమందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని 37 ఏండ్ల స్టాన్లీ యుజెన్‌‌ వెస్ట్‌‌గా గుర్తించారు. నిందితుడు అక్కడే ఉన్న మరో యువతిపైనా కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు గత రెండు వారాలుగా రాకేశ్‌‌ నిర్వహిస్తున్న మోటెల్‌‌ లోనే అద్దెకు ఉంటున్నట్టు పేర్కొన్నారు. 

కాల్పుల అనంతరం నిందితుడు మోటెల్ నుంచి పరారయ్యాడని వివరించారు. పిట్స్ బర్గ్ లోని ఈస్ట్ హిల్స్​లో అతడి ఆచూకీ పోలీసులకు దొరికింది. యుజెన్​వెస్ట్​ను పట్టుకోవడానికి ప్రయత్నించగా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడిపై హత్య, హత్యాయత్నం తదితర అభియోగాలు మోపారు.