భారత సంతతి ల్యాబ్ ఓనర్ కుఅమెరికాలో జైలు శిక్ష

భారత సంతతి ల్యాబ్ ఓనర్ కుఅమెరికాలో జైలు శిక్ష

టెస్టుల పేరుతో రూ.3,800 కోట్ల మోసం

హ్యూస్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన ల్యాబరేటరీ ఓనర్​కు 27 ఏండ్ల జైలుశిక్ష పడింది. టెస్టుల పేరుతో ప్రభుత్వాన్ని రూ.3,800 కోట్ల మోసం చేసినందుకు కోర్టు అతనికి ఈ శిక్ష విధించింది. జార్జియా స్టేట్​కు చెందిన మినాల్ పటేల్(44) ‘ల్యాబ్  సొల్యూషన్స్ ఎల్ఎల్ సీ’ పేరుతో ఓ ల్యాబ్  నడుపుతున్నాడు. పేషెంట్లు, మెడికేర్  లబ్ధిదారులకు అవసరంలేని జెనెటిక్, ఇతర ల్యాబరేటరీ టెస్టులు చేసి ప్రభుత్వానికి డాక్యుమెంట్లు సమర్పించాడు. ఇందుకోసం పేషెంట్ బ్రోకర్లు, టెలిమెడిసిన్ కంపెనీలు, కాల్ సెంటర్లతో కుమ్మక్కయ్యాడు.

 క్యాన్సర్ జెనెటిక్ టెస్టులను తక్కువ ధరకు చేస్తామని టెలిమెడిసిన్ కంపెనీలతో పేషెంట్లు, మెడికేర్ లబ్ధిదారులకు కాల్స్ చేయించాడు. దీంతో లబ్ధిదారులు టెస్టులు చేయించుకోవడానికి ఒప్పుకున్నారు. 2016 నుంచి 2019 మధ్య అతను ఫేక్  టెస్టులు చేశాడు. ఈ టెస్టుల కోసం రూ.3,800 కోట్లు ఖర్చయ్యిందంటూ మెడికేర్​కు డాక్యుమెంట్లు సమర్పించాడు. దీంతో ఎన్​హెచ్​ఐ ప్రోగ్రాం కింద పటేల్ ల్యాబ్​కు రూ.1500 కోట్లు చెల్లించారు. మెడికేర్  నుంచి పటేల్కు వ్యక్తిగతంగా రూ.174 కోట్లు అందాయి.