
అమెరికాలో ఇండియన్స్ పై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఒకడు తల నరికి చంపిన ఘటన మరువక ముందే.. మొన్న గ్యాస్ ఫిల్ చేసుకునేందుకు వచ్చిన నల్లజాతీయుడు ఇండియన్ స్టూడెంట్ ను కాల్చిచంపాడు. లేటెస్టుగా మరో దారుణ ఘటన అమెరికాలో ఉన్న ఇండియన్స్ ను భయాందోళనలకు గురిచేస్తోంది. అంతా ఓకేనా అని అడగటమే తప్పైనట్లుగా భారత సంతతి వ్యక్తిని షూట్ చేసి చంపేశాడు అమెరికాకు చెందిన ఓ దుర్మార్గుడు.
ఈ ఘటన శుక్రవారం (అక్టోబర్ 04 ఇండియాలో శనివారం) రాత్రి అమెరికాలోని పిట్స్ బర్గ్ లో చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన రాకేశ్ ఇహగబన్ (51) పెన్సిల్వేలియా రాష్ట్రం పిట్స్ బర్గ్ లోని రాబిన్ సన్ టౌన్ షిప్ లో మోటెల్ నిర్వహిస్తు్న్నాడు. మోటెల్ లో గొడవ జరుగుతుండగా.. కాస్త ఇబ్బందికి గురైన వ్యక్తిని.. ఆర్ యు ఆల్ రైట్ అని అడిగాడు రాకేశ్. అంతే.. అంతలోనే జేబులోనించి గన్ తీసిన స్లాన్లీ యూజీన్ వెస్ట్ (37) అనే దుండగుడు.. పాయింట్ బ్లాంక్ లో పెట్టి షూట్ చేశాడు. దీంతో రాకేశ్ అక్కడిక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
మహిళను, పోలీసును కూడా షూట్ చేసిన దుండగుడు:
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడు పిట్స్ బర్గ్ మోటెల్ లో రెండు వారాలుగా స్టే చేస్తు్నాడు. అయితే మోటెల్ పార్కింగ్ దగ్గర గన్ మన్ ఒక మహిళను షూట్ చేశాడు. పార్కింగ్ ఏరియాలో స్కూటర్ పై తన పాపతో కూర్చుకున్న మహిళను ఒక దుండగుడు షూట్ చేశాడు. ఆ వెంటనే గాయంతో విలవిలలాడుతూ ఆ మహిళ పోలీసులను వెతుక్కుంటూ వెళ్లిపోయింది.
ఈ ఘటన మోటెల్ బయట జరిగింది. ఘటన స్థలానికి వచ్చిన రాకేశ్.. అంతా ఓకేనా అని అడిగిన వెంటనే ఆ గన్ మన్.. రాకేశ్ తలలోకి షూట్ చేసి పారిపోయాడు. అక్కడున్న వాళ్లు చెప్పిన వివరాల ఆధారంగా దుండగుడిని వెంబడించారు పోలీసులు. దీంతో పోలీసును కూడా కాల్చపారేశాడు ఆ దుర్మార్గుడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.