
ఓ భారత సంతతి విద్యార్థిని యూనివర్సిటీలోని సరస్సులో పడి మరణించింది. వారం క్రితం కనిపించకుండా పోయిన 21 ఏళ్ల యువతి నిర్జీవంగా కనిపించడంతో తోటి విద్యార్థులు, ప్రొఫెసర్లు షాక్‌కు గురయ్యారు. కేరళకు చెందిన అన్రోస్ జెర్రీ అమెరికాలోని ఇండియానాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నోట్ర డామ్‌లో గ్రాడ్యుయేషన్ చదువుతోంది. వర్సిటీలో టాప్ స్టూడెంట్ అయిన ఆమెకు మ్యూజిక్‌పైనా మంచి పట్టు ఉంది. క్లాస్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జెర్రీ జనవరి 21న అదృశ్యమైంది. ఆమె కనిపించకపోవడంతో వర్సిటీ అధికారులు నోట్ర డామ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
నాటి నుంచి క్యాంపస్‌లో పలువురిని విచారించిన పోలీసులు జెర్రీ కోసం వెతుకులాట మొదలు పెట్టారు. కానీ, దురదృష్టవశాత్తు శుక్రవారం యూనివర్సిటీ అధికారులకు క్యాంపస్‌లో ఉన్న సరస్సులో ఓ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు డెడ్ బాడీని పోస్టుమార్టానికి పంపారు. ఆ మృతదేహం కనిపించకుండాపోయిన జెర్రీదేనని వారు తేల్చారు. అయితే ఆమె ఆ సరస్సులో ఎలా పడిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వర్సిటీలో టాప్ స్టూడెంట్ మరణాన్ని ఫ్రొఫెసర్లు, తోటి విద్యార్థులు తట్టుకోలేకపోయారు. అంత మంచి అమ్మాయిని కోల్పోవడం బాధగా ఉందని, ఆమె కుంటుబానికి సంతాపం తెలుపుతున్నామని వర్సిటీ ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తెలిపింది.