క్రీడా ప్రపంచంలో విషాదం.. 3 ఆసియా పారా గేమ్స్ పతకాలు సాధించిన నీరజ్ యాదవ్ సూసైడ్

క్రీడా ప్రపంచంలో విషాదం.. 3 ఆసియా పారా గేమ్స్ పతకాలు సాధించిన నీరజ్ యాదవ్ సూసైడ్

Neeraj Yadav: భారత క్రీడారంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మూడుసార్లు ఆసియా పారా గేమ్స్ (Asian Para Games) ఛాంపియన్, భారత స్టార్ పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (Neeraj Yadav) మంగళవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటనను ఇండియన్ పారా-అథ్లెటిక్స్ జాతీయ ప్రధాన కోచ్ ఎస్. సత్యనారాయణ (S. Satyanarayana) ఈరోజు (అక్టోబర్ 28, బుధవారం) అధికారికంగా ధృవీకరించారు. ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారని కోచ్ తెలిపారు.

వైకల్యాన్ని జయించి.. ఛాంపియన్‌గా నిలిచి: 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్ యాదవ్ జీవితం ఆరంభం నుంచీ సవాళ్లతోనే సాగింది. ఏడేళ్ల వయసులోనే పోలియో బారిన పడి వీల్‌చైర్‌కే పరిమితమైన నీరజ్.. మనోధైర్యంతో క్రీడారంగంలోకి అడుగుపెట్టాడు. దాదాపు ఏడేళ్ల పాటు వీల్‌చైర్ టెన్నిస్ ఆడిన నీరజ్, 2015లో అథ్లెటిక్స్ వైపు మళ్లాడు. 2015 ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ మీట్‌లో షాట్‌పుట్, జావెలెన్, డిస్కస్ త్రో విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 

ఆసియా పారా గేమ్స్‌లో పతకాల పంట: 

* 2018 ఆసియన్ పారా గేమ్స్ (ఇండోనేషియా): జావెలెన్ త్రో F55 విభాగంలో 29.84 మీటర్ల ఆసియా రికార్డుతో (Asian Record) పసిడి పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు.

* 2022 ఆసియన్ పారా గేమ్స్ (హాంగ్‌జౌ, చైనా): ఈ పోటీల్లో డబుల్ గోల్డ్ సాధించాడు. డిస్కస్ త్రో (F54/55/56), జావెలెన్ త్రో (F55) విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు ముద్దాడి చరిత్ర సృష్టించాడు.

* అంతర్జాతీయ వేదికలపై: 2016 ఫజ్జా గ్రాండ్ ప్రిక్స్‌లో వెండి పతకాలు, 2022 మొరాకో గ్రాండ్ ప్రిక్స్‌లో కొత్త జాతీయ రికార్డుతో (National Record) స్వర్ణం సాధించి భారత క్రీడా రంగానికి విశేష సేవలు అందించాడు.

* అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేసిన అరుదైన పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ అకాల మరణం పట్ల క్రీడాలోకం, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.