ఫ్రాన్స్ లో ఆపిన ఫ్లైట్ ముంబైలో దిగింది

ఫ్రాన్స్ లో ఆపిన ఫ్లైట్ ముంబైలో దిగింది
  •     276 మంది ప్రయాణికులను తీసుకొచ్చిన విమానం
  •     ఫ్రాన్స్ లోనే ఆగిన మరో 27 మంది  

ముంబై : మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్ లో నిలిపివేసిన విమానం.. మంగళవారం తెల్లవారుజామున ముంబైకి చేరుకుంది. ప్యారిస్ లోని వాట్రీ ఎయిర్ పోర్టు నుంచి సోమవారం రాత్రి బయలుదేరిన ఫ్లైట్.. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఇందులో మొత్తం 276 మంది ప్రయాణికులు వచ్చారని, వారిలో ఎక్కువ మంది మన దేశస్తులే ఉన్నారని అధికారులు తెలిపారు. ఫ్లైట్ లో మరో 15 మంది క్రూ సిబ్బంది ఉన్నారని చెప్పారు. ఇంకో 27 మంది ప్రయాణికులు ఫ్రాన్స్ లోనే ఉండిపోయారని పేర్కొన్నారు. ‘‘మేం ఆపిన ఫ్లైట్ లో మొత్తం 303 మంది ప్రయాణికులు ఉండగా.. 276 మంది తిరిగి వెళ్లారు. మరో 25 మంది ఫ్రాన్స్ లోనే ఉంటామని, ఆశ్రయం కల్పించాలని కోరారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇంకో ఇద్దరిని అరెస్టు చేసి జడ్జి ముందు హాజరుపరిచాం” అని ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. కాగా, ముంబై ఎయిర్ పోర్టులో దిగినంక ప్రయాణికులెవరూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

ఇల్లీగల్ గా అమెరికా వెళ్లే ప్రయత్నం.. 

రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్ లైన్స్ విమానం ఎయిర్ బస్ ఏ340 ఈ నెల 21న దుబాయ్ నుంచి సెంట్రల్ అమెరికాలోని నికరాగువాకు బయల్దేరింది. మార్గమధ్యలో ఇంధనం కోసం ఫ్రాన్స్ లోని వాట్రీ ఎయిర్ పోర్టులో దిగింది. ఆ టైమ్ లో విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఫ్లైట్ లో మానవ అక్రమ రవాణా బాధితులు ఉన్నట్టు చెప్పారు. 11 మంది మైనర్ల వెంట పెద్దవాళ్లు ఎవరూ లేరని గుర్తించారు. ప్రయాణికులను నాలుగు రోజుల పాటు తమ అధీనంలోనే ఉంచుకుని విచారణ జరిపారు. కాగా, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చాలామంది నికరాగువా వెళ్తుంటారు. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 96,917 మంది ఇండియన్స్ అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేసినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్యాట్రోల్ డేటాలో తేలింది. వీరిలో 41,770 మంది మెక్సికన్ బార్డర్ నుంచి యూఎస్ లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైంది.