ఫార్మాపై ట్రంప్ 200 శాతం సుంకం.. బెదరని భారత ఫార్మా స్టాక్స్.. లాభాల్లోనే..

ఫార్మాపై ట్రంప్ 200 శాతం సుంకం.. బెదరని భారత ఫార్మా స్టాక్స్.. లాభాల్లోనే..

Trump Pharma Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 200 శాతం పన్ను విధిస్తానంటూ ప్రకటించారు. ఫార్మా ఉత్పత్తి కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకునేందుకు గడువు ఇస్తారన్నారు. తయారీ సంస్థలు రీలొకేట్ అయ్యేందుకు ఏడాదిన్నర వరకు గడువు ఇస్తానన్న ట్రంప్.. ఆ తర్వాత సుంకాలు విధించనున్నట్లు చెప్పారు.

గడువులోపు అమెరికాలో కార్యకలాపాలను స్టార్ట్ చేయకపోతే.. ఫార్మా దిగుమతులపై ఏకంగా 200 శాతం వరకు సుంకాలు వేసేందుకు వెనుకాడేదే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. అయితే భారత ఫార్మా కంపెనీలు మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను అస్సలు పట్టించుకోవటం లేదని తెలుస్తోంది.

ALSO READ : Gold Rate: బుధవారం బంగారం క్రాష్.. హైదరాబాదులో తగ్గిన రేట్లివే..

ట్రంప్ ప్రకటన తర్వాత నేడు నిఫ్టీ ఫార్మా సూచీ స్వల్పంగా లాభపడింది. ఈ క్రమంలో ప్రముఖ ఫార్మా సంస్థలైన లుపిన్, బయోకాన్, అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్స్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో లాభపడ్డాయి. ఈ తరుణంలో ఇండియన్ ఫార్మా కంపెనీలు కార్యకలాపాలను అమెరికాకు తరలించలేకపోయినా.. లేదా ఖర్చులను పెంచలేకపోయినా ఉత్పత్తిని నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనరిక్ మందులు తక్కువ ఆదాయ మార్జిన్లను కలిగి ఉంటాయని.. ఈ క్రమంలో ఫార్మా కంపెనీలు రేట్లను పెంచలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల ఉత్పత్తిని నిలిపివేస్తే అమెరికాలో మందుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు నిపుణులు.

ఇదే క్రమంలో ట్రంప్ రాగి దిగుమతులపై 50 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించటంతో హిందుస్థాన్  కాపర్, వేదాంత, హిందాల్కో కంపెనీల షేర్లు నేడు ఇంట్రాడేలో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇదే క్రమంలో కాపర్ ఫ్యూచర్స్ అమాంతం 12 శాతం పెరుగుదలను చూశాయి.