ఇండియన్​ రేసింగ్​ లీగ్​ అట్టర్​ ఫ్లాప్

ఇండియన్​ రేసింగ్​ లీగ్​ అట్టర్​ ఫ్లాప్
  • ఐదు ఐఆర్​ఎల్​ రేసుల్లో ఒక్కటీ జరగలే.. జేకే టైర్​ నేషనల్​ రేసింగ్​తో ముగింపు
  • వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్న వాళ్లకు లభించని ఎంట్రీ
  • డబ్బులు వాపస్​ ఇవ్వాలని ప్రేక్షకుల ఆందోళన
  • పోలీసులు, ఇతర అధికారుల కుటుంబాలతో నిండిన గ్యాలరీలు

హైదరాబాద్, వెలుగు: హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఇండియన్​ రేసింగ్ లీగ్(ఐఆర్​ఎల్​) అట్టర్ ఫ్లాప్ అయింది. అడుగడుగునా నిర్వహణ లోపం బయటపడింది.  ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొన్న చాలా మందికి ఎంట్రీ కూడా లభించలేదు. పైగా రెండు రోజుల్లో ఐదు ఐఆర్​ఎల్​  రేసులు జరగాల్సి ఉండగా.. ఒక్క రేసు కూడా జరగలేదు. మొదటి రోజు ప్రాక్టీస్ తో​.. రెండో రోజు మూడు ప్రమాదాల కారణంగా కేవలం జేకే టైర్​ నేషనల్​ రేసింగ్​తో ముగించేశారు. శనివారం వీఐపీ గ్యాలరీలోకి మంత్రి కేటీఆర్ వచ్చిన సమయంలో గ్యాలరీ కుంగిపోయింది. ఆదివారం సౌకర్యాలు లేక ప్రేక్షకులు ఆందోళనకు దిగడంతో  అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రూ. 6 వేల నుంచి 12 వేల ఖరీదైనా టికెట్లు కొనుగోలు చేసి ఆదివారం లీగ్​ చూసేందుకు వచ్చిన వారికి చేదు అనుభవం ఎదురైంది. వీఐపీలతో పాటు ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసిన వారి కోసం ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేసినా.. ఆ గ్యాలరీలు అప్పటికే పోలీసులు, ఇతర అధికారుల కుటుంబాలతో నిండిపోయాయి. కెపాసిటీకి మించి గ్యాలరీల్లో ప్రేక్షకులు ఉన్నారంటూ టికెట్లు కొన్న వారిని పోలీసులు ఎంట్రెన్స్​ వద్ద నిలిపివేశారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వేలాది రూపాయలు పెట్టి  తాము టికెట్లను కొంటే ఇక్కడ ఎందుకు ఆపేశారని,  ఆర్గనైజర్స్​ని పిలవాలని, తమ డబ్బులు వాపస్​ చేయాలని పట్టుబట్టారు. గంట, రెండు గంటల పాటు ఎంట్రెన్స్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత అనుమతించినప్పటికీ.. అది వీఐపీ గ్యాలరీల్లోకి కాకుండా  ఐమాక్స్​లో ఓపెన్ ప్లేస్ లో ఏర్పాటు  చేసిన గ్యాలరీలోకి పంపారు. దీనిపై  ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఏసీ గ్యాలరీ ఉంటుందని, అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాక తమను ఎక్కడో ఓ చోటికి పంపించడమేమిటని నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. 

రాబోయే పోటీలపై ప్రభావం!

శని, ఆదివారం హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​ తీరంలో ఏర్పాటు చేసిన ఇండియన్​ రేసింగ్​ లీగ్​ మొదటి దశది.  షెడ్యూల్​ ప్రకారం శనివారం మూడు రేస్​లు జరగాల్సి ఉంది. ఆదివారం మరో రెండు రేస్​లు జరగాల్సి ఉంది. కానీ.. ఏ ఒక్కటీ జరగలేదు. ప్రమాదాల కారణంగా ఐఆర్​ఎల్​ పోటీలు రద్దయ్యాయి. చివరికి జేకే టైర్​ నేషనల్​ రేసింగ్​ చాంపియన్​షిప్​ మాత్రం నిర్వహించారు. ఈ నెల 25, 27న  రెండో దశ, వచ్చే నెల 2, 4న మూడో దశ ఐఆర్​ఎల్​ పోటీలు చెన్నైలో జరగనున్నాయి. తిరిగి నాలుగో దశ పోటీలు డిసెంబర్​ 10, 11న హుస్సేన్​సాగర్​ తీరంలోనే జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఇదే ట్రాక్​పై ఫార్ములా –-ఇ రేస్​ కూడా జరగాల్సి ఉంది. మొదటి దశ పోటీల్లో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపించడంతో ఈ ప్రభావం ఇక్కడ జరిగే మిగతా పోటీలపై ఉంటుందని ప్రేక్షకులు అంటున్నారు. 

ట్రాక్ చుట్టూ 7 వేల మంది కోసం సీటింగ్

రేసింగ్​ను  చూసేందుకు రేసింగ్ ట్రాక్ చుట్టూ 7 వేల మంది ప్రేక్షుకుల కోసం ఏర్పాట్లు చేయడంతో పాటు అందుకు సంబంధించిన రూ.749, రూ.1,249 టికెట్లను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. వందలాది రూపాయలు తీసుకొని ఎండలో కూర్చొబెట్టారని ప్రేక్షకులు మండిపడ్డారు. ఫస్ట్ డే శనివారం  10 శాతం మంది కూడా ప్రేక్షకులు రాలేదు.  సెకండ్ డే ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున వచ్చారు. రేసింగ్ లీగ్ కారణంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. దీంతో మొదటి రోజు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లక్డికాపూల్ నుంచి పంజాగుట్ట, అటు రాణిగంజ్, ఇటు మెహిదిపట్నం వరకు, నారాయణగూడ,  అసెంబ్లీ  తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయింది. సెకండ్ డే సండే కావడంతో కొంత మేరా మాత్రమే ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఖైరతాబాద్, లక్డికాపూల్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయంలో కాస్తా ట్రాఫిక్ జామ్ అయింది. రెండ్రోజులపాటు జరిగే లీగ్ లు ముగియడంతో సోమవారం నుంచి ట్యాంక్ బండ్ పై నుంచి ఎప్పటిలాగే వెహికల్స్​ను వదిలివేయనున్నారు.

ఏర్పాట్లు సరిగ్గాలేవు

రేసింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో  ఎంజాయ్ చేద్దామని 10 మందిమి వచ్చాం. ఒక్కొక్కరికి రూ.7 వేలు పెట్టి టికెట్లు కొనుగోలు  చేశాం. అయితే టికెట్లు కొనేముందు ఆన్ లైన్ లో ఏదో చెప్పారు. కానీ ఇక్కడ ఏర్పాట్లు సరిగ్గాలేవు. -అభిలాష్, హైదరాబాద్