క‌రోనా పేషెంట్ల‌ ట్రీట్మెంట్ కు ట్రైన్లు రెడీ: బోగీలు ఎలా మారాయో చూడండి

క‌రోనా పేషెంట్ల‌ ట్రీట్మెంట్ కు ట్రైన్లు రెడీ: బోగీలు ఎలా మారాయో చూడండి

దేశంలో రోజు రోజుకీ క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు వైర‌స్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ ద్వారా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటూనే.. ఏ మాత్రం అనుకోని ప‌రిస్థితులు త‌లెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధ‌ముంతోంది భార‌త ప్ర‌భుత్వం. రాష్ట్రాల్లోనూ ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య స‌దుపాయాల‌ను మెరుగుచేసుకునేలా ఆయా ప్ర‌భుత్వాల‌కు స‌హ‌కరిస్తూ.. ఇత‌ర‌త్రా మార్గాల‌ను సైతం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వినూత్న నిర్ణ‌యంతో రైల్వే శాఖ ముందుకొచ్చింది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల‌లో భారీ సంఖ్య‌లో ట్రైన్ల‌ను ఐసోలేష‌న్ వార్డులుగా  మార్చి క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే ఒక బోగీని అన్ని వ‌స‌తుల‌తో ట్రీట్మెంట్ కు అనుగుణంగా మార్చింది. దీని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆమోదం కోసం ప్ర‌తిపాద‌న పంపింది.

ఒక్కో బోగీలో 9 మంది పేషెంట్లు

అస్సాంలోని నార్త ఈస్ట్ ఫ్రాంటియ‌ర్ రైల్వే జోన్ ఒక బోగీని క‌రోనా పేషెంట్ల చికిత్సకు అనుగుణంగా సిద్ధం చేసింది. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ స‌హా ఇత‌ర‌ వైద్య ప‌రిక‌రాల‌తో కోచ్ లో మార్పులు చేసింది. ఒక్కో బోగీలో తొమ్మిది మంది పేషెంట్ల‌ను ఉంచి ట్రీట్మెంట్ చేయ‌గ‌లిగే రెడీ చేసింది. ప్ర‌తి జోన్ లో వారానికి 10 కోచ్ ల‌ను ఐసోలేష‌న్ వార్డులుగా మార్చ‌గ‌ల‌మ‌ని రైల్వే అధికారులు తెలిపారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఎదురైతే పేషెంట్ల‌కు చికిత్స అందించేందుకు అవ‌స‌రాన్ని బ‌ట్టి మూడు ల‌క్ష‌ల బెడ్స్ సిద్ధం చేస్తామ‌ని చెప్పారు.

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని వణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అగ్ర‌రాజ్యాలు సైతం అల్లాడిపోతున్నాయి. చైనాలో 81 వేల మందికి ఈ వైరస్ సోక‌గా.. 3295 మంది మ‌ర‌ణించారు. అత్యాధునిక టెక్నాల‌జీ, హై క్లాస్ వ‌స‌తులు ఉన్న అమెరికాలోనే క‌రోనా బారిన‌ప‌డిన వాళ్ల సంఖ్య ల‌క్ష దాటిపోయింది. దాదాపు 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇట‌లీలో అత్య‌ధికంగా 9 వేల మందికి పైగా మ‌ర‌ణించారు. ఈ దేశంలో 86 వేల మందికి ఈ వైర‌స్ సోకింది.

మ‌న దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 930కి చేర‌గా.. 20 మంది మ‌ర‌ణించారు. వైర‌స్ వ్యాప్తి తీవ్ర స్థాయి చేర‌క‌ముందే భార‌త ప్ర‌భుత్వం మేలుకుని అన్ని రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించి.. క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే ఏ మాత్రం ప‌రిస్థితి అదుపుత‌ప్పినా దాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డేలా ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రైల్వే శాఖ ఇన్సియేటివ్ తీసుకుని క‌రోనా పేషెంట్ల కోసం ట్రైన్ల‌నే ఐసోలేష‌న్ వార్డులుగా మారుస్తోంది.