క‌రోనా లాక్ డౌన్: ట్రైన్ రిజ‌ర్వేష‌న్ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ‌

క‌రోనా లాక్ డౌన్: ట్రైన్ రిజ‌ర్వేష‌న్ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ‌

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత అన్ని ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయి. అయితే ఏప్రిల్ 14న ఈ లాక్ డౌన్ ముగుస్తుండ‌డంతో 15వ తేదీ నుంచి రైలు ప్ర‌యాణాల‌కు సంబంధించి రిజ‌ర్వేష‌న్ల‌ను రైల్వే శాఖ ప్రారంభించిందంటూ కొన్ని మీడియా సంస్థ‌లు, సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ న్యూస్ పై రైల్వే శాఖ స్పందించింది. ఈ వార్త‌ల్లో నిజం లేదంటూ వాటిని ఖండించింది.

ఇప్పుడు స్టార్ట్ చేయ‌డం అబ‌ద్ధం

ఏప్రిల్ 15 నుంచి రైలు ప్ర‌యాణాల‌కు సంబంధించి ఇప్పుడు కొత్త‌గా రైల్వే శాఖ రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టింద‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని ట్విట్ట‌ర్ ద్వారా భార‌త రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. లాక్ డౌన్ అమ‌లులో ఉన్న మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు త‌ప్ప మిగిలిన రోజుల‌కు రిజ‌ర్వేష‌న్ అస‌లు నిలిపేయ‌లేద‌ని వెల్ల‌డించింది. వాస్త‌వానికి రైల్వే అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ 120 రోజుల ముందు నుంచే చేసుకోవ‌చ్చ‌ని వివ‌రించింది. అంటే ఏప్రిల్ 15కు సంబంధించిన రిజ‌ర్వేష‌న్ లాక్ డౌన్ ప్ర‌క‌ట‌న‌కు చాలా ముందుగానే మొద‌లైన‌ట్లు తెలిపింది.