రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఐదు బాంబులు: నెటిజన్ ట్వీట్‌తో అలర్ట్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఐదు బాంబులు: నెటిజన్ ట్వీట్‌తో అలర్ట్

ఢిల్లీలో అల్లర్ల నేపథ్యంలో ఓ ట్వీట్.. రైల్వే పోలీసులకు ముచ్చమటలు పట్టించింది. బాంబ్ స్క్వాడ్, భద్రతా బలగాలను పరుగులు పెట్టించింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఐదు బాంబులు ఉన్నాయంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. సోదరుడికి ట్రైన్ ఆలస్యంగా వచ్చిందన్న కోపంతో పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.

ట్వీట్‌తో అలర్ట్.. వెంటనే చెకింగ్

న్యూఢిల్లీ నుంచి దిబ్రూగఢ్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ (12424) రోజూ సాయంత్రం 4.10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది. ‘12424 నంబర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఐదు బాంబులు ఉన్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోండి’ అంటూ సంజీవ్ సింగ్ గుజ్జార్ అనే నెటిజన్.. రైల్వే మినిస్ట్రీ ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్, మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ పోలీస్, ఐఆర్సీటీసీ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై రైల్వే శాఖ వెంటనే స్పందించింది. అప్పటికే రైలు బయలుదేరడంతో యూపీలోని దాదరీ స్టేషన్‌లో దాన్ని ఆపేశారు. హుటాహుటీన రైల్వే పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిటెక్షన్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. ప్రయాణికులు భయపడకుండా భద్రతా పరమైన డ్రిల్ అని చెప్పి కిందికి దించేసి.. అన్ని బోగీలను చెక్ చేశారు. ఆ రూట్‌లో వెళ్లే మిగతా ట్రైన్లకు ఇబ్బంది లేకుండా లూప్ ట్రాక్‌లో ఉంచి తనిఖీలు చేశారు.

సోదరుడి ట్రైన్ లేట్ అయిందన్న కోపంతో…

రాజధాని ట్రైన్‌లో బాంబులు ఉన్నాయంటూ ట్వీట్ చేసిన సంజీవ్ సింగ్ గుజ్జార్ దాదాపు 3 గంటల తర్వాత మళ్లీ ట్వీట్ చేశాడు. ‘నేను అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి’ అని భారత ప్రభుత్వాన్ని కోరాడు. బాంబులు ఉన్నాయని చెప్పడానికి విచిత్రమైన కారణాన్ని చెప్పాడు. శుక్రవారం తన సోదరుడు వెళ్లాల్సిన రైలు 4 గంటల ఆలస్యంగా వచ్చిందని రైల్వేపై తనకు కోపం వచ్చిందట. మానసికంగా ఆ టైంలో తాను ఏం చేస్తున్నానో తెలియలేదని, అందుకే ట్రైన్‌లో బాంబులు ఉన్నాయని అబద్ధం చెప్పానని మరో ట్వీట్ చేశాడు.

అయితే పోలీసులు మాత్రం ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రైలును పూర్తిగా తనిఖీ చేశాకే వదిలారు. రైలులో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని, రాత్రి 8 గంటలకు దాదరీ స్టేషన్ నుంచి ట్రైన్ ప్రయాణం కొనసాగించిందని ఆగ్రా రైల్వే పోలీస్ ఎస్పీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇలా బాంబు బెదిరింపుకు పాల్పడిన ఆ వ్యక్తిపై కేసు పెట్టి.. క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.