2025లో అత్యంత బలహీనంగా మారిన ఆసియా కరెన్సీగా భారతీయ రూపాయి నిలిచింది. ఈ ఏడాది డాలర్ తో పోల్చితే రూపాయి పతనం వేగంగా కొనసాగటంతో 2022 తర్వాత అత్యంత తక్కువ విలువకు చేరుకుంది. అయితే దీనికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక కారణంగా నిలిచింది. రెండు దేశాల మధ్య వార్ వల్ల క్రూడ్ ఆయిల్ రేటు 100 డాలర్ల మార్కును చేరుకోటవంతో 90 శాతం క్రూడ్ దిగుమతులపై ఆధారపడిన ఇండియా భారీ ఒత్తిడికి గురైంది. ఇది కరెన్సీపై అధిక ఒత్తిడిని క్రియేట్ చేసింది.
భారత రూపాయి పతనానికి మరో ప్రధాన కారణం ట్రంప్ సర్కార్ భారత్ పై వేసిన అధిక సుంకాలు, అలాగే దేశీయ మార్కెట్ నుండి విదేశీ పెట్టుబడిదారుల భారీగా తరలిపోవటం ఉన్నాయి. రూపాయి స్థిరంగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టినప్పటికీ.. జూలై మొదటి నుంచి 30 బిలియన్ డాలర్లకు పైగా అమ్మకాలు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ మధ్యలో రూపాయి కొత్త కనిష్టాలకు చేరకుండా RBI యత్నించగా.. నవంబర్ 21న రూపాయి 89.4812కి అమెరికన్ డాలర్ కంటే పడిపోయింది. రిజర్వు బ్యాంక్ అప్పటి నుంచి కరెన్సీ రక్షణ విధానాన్ని ఆపిందని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చలు వాయిదా పడిన పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడటానికి సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో అమెరికాతో వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవటం.. సుంకాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టడం రూపాయిపై ఒత్తిడిని తగ్గించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులను చూపుతూ సుంకాలను ఆసియాలోనే ఏ దేశంపైనా లేని విధంగా 50 శాతానికి పెంచటంతో రూపాయి దిశ పూర్తిగా మారిందని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. డాలర్లతో రూపాయి తన బలాన్ని కోల్పోతున్నట్లు వారు చెబుతున్నారు.
నవంబరు మాసంలో విదేశీ పెట్టుబడులు భారీగా తరలివెళ్లటం, అమెరికా భారీ సుంకాలు, మార్కెట్ అంచనాలు తగ్గటం వంటి పరిణామాలు రూపాయిపై ఒత్తిడిని క్రమంగా పెంచుతూ వచ్చాయి. ఆర్బీఐ ఇప్పటి వరకు డాలర్లను అమ్మడం, డాలర్ కొరకు భవిష్యత్ ముందస్తు ఒప్పందాలు వంటి మార్గాల ద్వారా తన కరెన్సీ మారకాలు నియంత్రిస్తుంది. కానీ 2024 డిసెంబరులో కొత్త గవర్నర్ నియామకంతో RBI కాస్త "హ్యాండ్-ఆఫ్" విధానంలో మారినట్లు IMF సూచించింది.
