
ప్రస్తుతం ఇస్రో సైంటిస్టులు గగన్‌యాన్‌పై దృష్టిపెట్టారు. 2022లో మనిషిని అంతరిక్షంలోకి పంపేందుకూ కసరత్తులు చేస్తున్నారు. గగన్‌యాన్ సక్సెస్ అయితే ఆ తర్వాత మరో కీలక మిషన్ చేపట్టేందుకు కూడా మన సైంటిస్టులు సిద్ధం అవుతున్నారు. అదే అంతరిక్షంలో మన అడ్డా! అంటే.. మన సొంత స్పేస్ స్టేషన్. మరో ఐదు నుంచి ఏడేళ్లలోపు సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ జూన్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లాగా మరీ పెద్దగా ఉండదని, కేవలం ముగ్గురికి సరిపోయేంత మాత్రమే ఒక ‘మినీ స్పేస్ స్టేషన్’లా ఉంటుందని తాజాగా ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. మన సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు అనేది గగన్ యాన్ సక్సెస్ మీదనే ఆధారపడి ఉంటుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు.
2022లో ముగ్గురు ఆస్ట్రోనాట్లను అంతరిక్షానికి పంపి, క్రూ మాడ్యూల్ ద్వారా తిరిగి భూమికి తీసుకురావడం గగన్‌యాన్ లక్ష్యం. ఇందుకోసం వాడే టెక్నాలజీలు సక్సెస్ అయితేనే అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్‌లను డాకింగ్ చేసేందుకు మార్గం దొరుకుతుందంటున్నారు. ఇందుకోసమే స్పేస్ డాకింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఇస్రో రూ.10 వేల కోట్లను కేటాయించింది. వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీని పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. అలాగే గగన్‌యాన్‌లో 650 ప్రైవేట్ ఇండస్ట్రీలు సహకారం అందిస్తున్నాయని, స్పేస్ స్టేషన్ ఏర్పాటులోనూ భాగస్వామ్యం కానున్నాయని సైంటిస్టులు తెలిపారు. ఈ స్పేస్‌స్టేషన్‌ను భూమికి 120 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల ఎత్తులోనే ఏర్పాటు చేస్తారట.