అన్ని సమస్యలకూ జవాబు స్టార్టప్​లే!

అన్ని సమస్యలకూ జవాబు స్టార్టప్​లే!
  • ఏ సమస్యను అయినా పరిష్కరిస్తయ్​
  • నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​

న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న ఏ సమస్యను అయినా పరిష్కరించే సత్తా స్టార్టప్​లకు ఉందని నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​ అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, బిజినెస్​ చేయడానికి ఇవి సరికొత్త, వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నాయని మెచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన స్టార్టప్​ల అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చౌకగా నెట్​ అందుబాటులోకి రావడం, ప్రతి ఒక్కరూ స్మార్ట్​ఫోన్లు వాడటం, ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సాయం అందడం, ట్యాలెంట్​ పూల్ పెరగడం వల్ల స్టార్టప్ ల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎకనమిక్​ గ్రోత్​ స్ట్రాటజీలో స్టార్టప్ లు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. ‘‘స్టార్టప్​ల వల్ల భారీ స్కిల్డ్​ జాబ్స్​ వస్తాయి. ఆటోమేషన్​వల్ల కొన్ని ఉద్యోగాలు పోతున్నాయి. ఈ సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఎన్నో అవకాశాలు ఉన్న కొత్త బిజినెస్​లలోకి స్టార్టప్ లు చొచ్చుకుపోతున్నాయి. ఉదాహరణకు ఎలక్ట్రిక్​ వెహికల్స్​లో అమర్చే బ్యాటరీల తయారీ బిజినెస్​. పీఎల్​ఐ వంటి స్కీముల వల్ల ఎన్నో సబ్సిడీలు వస్తున్నాయి. స్టార్టప్ ల ఇన్నోవేషన్లు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2015–16లో డొమెస్టిక్​ పేటెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య 12 వేలు కాగా, 2020–21లో వీటి సంఖ్య 25 వేలకు పెరిగింది. అంటే స్టార్టప్ లు పెద్ద ఎత్తున కొత్త టెక్నాలజీలను, పద్ధతులను కనుగొంటున్నాయని అర్థమవుతోంది. అందుకే చాలా స్టార్టప్ లు యూనికార్న్​లుగా ఎదుగుతున్నాయి. గత మూడు నెలల్లో 11 స్టార్టప్ లు యూనికార్న్​లుగా ఎదిగాయి. దాదాపు నాలుగు నెలలకు ఒక యూనికార్న్​ ఏర్పడుతోంది. మనదేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యలను ఇవి పరిష్కరిస్తున్నాయి”అని కాంత్​ వివరించారు. 

ఆకాశమే హద్దు..

స్టార్టప్ లకు కేవలం ఇండియా మాత్రమే మార్కెట్​ కాదని, ఇవి ఎదిగే కొద్దీ, సమస్యలను పరిష్కరించే కొద్దీ ప్రపంచమంతటా విస్తరించవచ్చని అన్నారు. త్వరలో ప్రపంచంలోని 500 కోట్ల మంది పేదల నుంచి మధ్యతరగతికి ఎదుగుతారని, వీరందరికీ స్టార్టప్ లు సేవలను అందించవచ్చని చెప్పారు. స్టార్టప్ ల అభివృద్ధి కోసం మొదలుపెట్టిన ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం వల్ల ఆశించిన లాభాలను అందుకున్నామని, గత కొన్నేళ్లలో స్టార్టప్ ఎకోసిస్టమ్​ ఎన్నో అడ్డంకులను దాటుకొని అద్భుతంగా ఎదిగిందని మెచ్చుకున్నారు. ‘‘2016లో మనదేశంలోని స్టార్టప్ ల సంఖ్య చాలా తక్కువ. వాటికి అందిన సాయమూ తక్కువే! ఇన్వెస్ట్​మెంట్లు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అత్యంత సమర్థమైన స్టార్టప్ ఇకోసిస్టమ్​ ఉన్న ​దేశాల్లో మనకూ స్థానం దక్కింది. ఎక్కువ స్టార్టప్​లు ఉన్న దేశాల్లో ఇండియాకు మూడోస్థానం వచ్చింది. ఇప్పటి వరకు మనదేశంలో 67 వేల స్టార్టప్ లు ప్రభుత్వం వద్ద రిజిస్టర్​ చేసుకున్నాయి. ఇది చాలా గొప్ప విషయం”అని అన్నారు. స్టార్టప్ లు పాత వ్యాపార పద్ధతులను తొలగించి కొత్తవి తెచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది జనవరిలో అన్నారు. మనదేశంలోని స్టార్టప్ ల డైరెక్టర్లలో 44 శాతం మంది మహిళలు ఉన్నారని, మహిళా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని ప్రశంసించారు. 45 శాతం స్టార్టప్ లు చిన్న సిటీల్లో ఉన్నాయని, లోకల్ ప్రొడక్టులకు ఇవి బ్రాండ్​ అంబాసిడర్లుగా పనిచేస్తున్నాయని అన్నారు. ‘‘స్టార్టప్ ఎకోసిస్టమ్​ను బలోపేతం చేయడానికి రిజిస్ట్రేషన్​ను సింపుల్​గా మార్చేశాం. మూడేళ్లపాటు ట్యాక్స్​రాయితీలు ఇస్తున్నాం. గవర్నమెంటు కాంట్రాక్టులు తీసుకునేందుకూ అనుమతి ఇచ్చాం. పేటెంట్ ఫైలింగ్​ ఖర్చును తగ్గించాం. ఇండియాలో బలమైన డిజిటల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఉండటంతో  మన స్టార్టప్ లు సత్తా చాటుతున్నాయి. యూపీఐ, ఆధార్​, ఇన్​స్టంట్​ ఆర్​టీపీఎస్​వంటి డిజిటల్​ ఇన్​ఫ్రా వల్ల ప్రభుత్వాలు, బిజినెస్​లు, స్టార్టప్ లు ఎన్నో విధానాల ఫైనాన్షియల్​ సర్వీసులను అందించగలుగుతున్నాయి”అని అమితాబ్​ కాంత్​ వివరించారు.