Market Fall: సోమవారం నష్టాల్లో మార్కెట్లు.. టాటా క్యాపిటల్ ఫ్లాట్ లిస్టింగ్..

Market Fall: సోమవారం నష్టాల్లో మార్కెట్లు.. టాటా క్యాపిటల్ ఫ్లాట్ లిస్టింగ్..

Stock Markets: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి. మార్కెట్ల ప్రారంభంలో భారీగా నష్టాల్లోకి జారుకున్న సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ తిరిగి తేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10.31 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 228 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుండగా... మరో కీలక సూచీ నిఫ్టీ 72 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. 

ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 25 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 183 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ ఐటీ రంగం వరుసగా రెండో రోజూ నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కొఫొర్జీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ స్టాక్స్ 1 శాతం మేర నష్టాలను నమోదు చేశాయి. అయితే టీసీఎస్ తర్వాత మిగిలిన ఐటీ కంపెనీలు కూడా తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం అయ్యారు. మరోపగక్క కన్జూమర్ డ్యూరబుల్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. 

మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చైనాపై 100 శాతం సుంకాల వార్నింగ్ మార్కెట్లలో టెన్షన్ పెంచేసింది. అయితే ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ ప్రతిష్ఠంభన త్వరలోనే సొమసిపోతుందని యూఎస్ ఫ్యూచర్స్ రీబౌండ్ అవ్వటం సూచిస్తోందని నిపుణులు అంటున్నారు. అలాగే చాలా కాలంగా మార్కెట్లకు దూరమైన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ ఇన్వెస్ట్ చేయటం భారత మార్కెట్ల స్థిరీకరణకు దోహదపడుతుందని వారు చెబుతున్నారు. 

టాటా క్యాపిటల్ లిస్టింగ్.. 
మార్కెట్ల అస్థిరత మధ్య నేడు టాటా క్యాపిటల్ స్టాక్ కేవలం 1.23 శాతం ప్రీమియం రేటు రూ.330 వద్ద లిస్ట్ అయ్యాయి.  అయితే ఇది గ్రేమార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. రూ.15వేల 512 కోట్లను సమీకరించిన ఐపీవో ఫ్లాట్ లిస్టింగ్ కారణంగా బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలు అందలేదు. కంపెనీ షేర్లు దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం కలిగిన ఇన్వెస్టర్లు హోల్డ్ చేయటం మంచిదని, దేశంలో ఎన్బీఎఫ్సీ వ్యాపారం వృద్ధి చెందుతోందని మెహతా ఈక్విటీస్ ప్రతినిధి ప్రశాంత్ థాప్సే అభిప్రాయపడ్డారు.