
- తిండి కూడా సరిగా పెట్టకుండా చిత్రహింసలు
- బంధువే బంధించి నరకం చూపించిన వైనం
- ముగ్గురు ఇండియన్ అమెరికన్స్అరెస్టు
వాషింగ్టన్ : అమెరికాలో బంధువు చేతనే కిడ్నాప్‌కు గురై చిత్రహింసను అనుభవించిన ఇండియన్ స్టూడెంట్ ను అమెరికా పోలీసులు రక్షించారు. 20 ఏండ్ల బాధిత స్టూడెంట్ను ఏడు నెలలుగా బంధించి మూడు ఇండ్లు, ఒక ఆఫీసులో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించారు. బాధితుడికి సరైన తిండి పెట్టకుండా వైర్లు, పైపులతో తీవ్రంగా కొట్టారు. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ చార్లెస్ కౌంటీలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వంటి నిండా గాయాలతో బలహీనంగా ఉన్న బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. బాధిత స్టూడెంట్ పేరును బయటకు వెల్లడించలేదు. బాధితుడు మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకునేందుకు నిరుడు అమెరికా వచ్చాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టూడెంట్ను బంధువు వెంకటేశ్ ఆర్ సత్తారు తన ఇంటికి తీసుకెళ్లాడు.
తన ఇద్దరు ఫ్రెండ్స్ నిఖిల్ వర్మ, శ్రావణ్ వర్మతో కలిసి వీసా ఇప్పిస్తామని చెప్పి అన్ని సర్టిఫికెట్లు ధ్వంసం చేశారు. తర్వాత వెంకటేశ్ స్టూడెంట్‌తో తన మూడు ఇండ్లలో బలవంతంగా పనులు చేయించడం మొదలుపెట్టాడు. తన సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చాకిరీ చేయించేవాడు. ఈ ఏడు నెలలుగా అతడిని ఇంటి బేస్మెంట్లో బంధించారు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అయితే, 911కి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా పోలీసులు బుధవారం సత్తారు ఇంటికి వెళ్లారు. అదే టైమ్‌లో బాధిత స్టూడెంట్ బేస్మెంట్ నుంచి పరిగెత్తుకొచ్చాడు. అతడిని కాపాడిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.