భారత పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ.. ఎక్కడంటే

భారత పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ.. ఎక్కడంటే

ఇరాన్‌ను సందర్శించాలనుకునే భారత పర్యాటకులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. ఇక నుంచి వీసా లేకుండానే ఆ దేశాన్ని సందర్శించవచ్చని ప్రకటించింది. భారత్‌ సహా 33 దేశాల వారు వీసాలు లేకుండా తమ దేశాన్ని సందర్శించవచ్చునని ఇరాన్‌ దేశ మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ఆ దేశ పర్యాటక మంత్రి ఎజ్జతొల్లా జర్గమి  వెల్లడించారు.

 తమ దేశానికి వచ్చే విదేశీ సందర్శకుల సంఖ్యను పెంచి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ఇరాన్‌ ఫోబియా ప్రచారానికి దీంతో అడ్డుకట్ట పడుతుందన్నారు. భారత్‌, గల్ఫ్‌ ప్రాంతాలతో సహా 33 దేశాల పర్యాటకులు వీసా అవసరంలేకుండా తమ దేశంలో పర్యటిం చవచ్చని ఇరాన్‌ ప్రకటించింది. పర్యాటకులను ఆకర్షించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో విదేశీ పర్యాటకులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తుర్కియే, అజర్‌బైజాన్‌, ఒమన్‌, చైనా, అర్మేనియా, లెబనాన్‌, సిరియా దేశాల పర్యాటకులకు వీసా నిబంధనల నుంచి మినహాయిం పు ఇచ్చింది. దీంతో వీసా అవసరం లేకుండా ఇరాన్‌లో పర్యటించే అవకాశమున్న దేశాల సంఖ్య 45కి చేరింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ సమాజం పట్ల ఇరాన్‌ వైఖరికి నిదర్శనమని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి చెప్పారు. 

ఇంతకుముందే వియత్నం కూడా భారత్‌తో పాటు చైనా పర్యాటకులకు వీసా అవసరం లేని ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడెన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్, ఫిన్లాండ్ దేశస్థులకు సైతం వియత్నం వీసా ఫ్రీ ఎంట్రీకి వీలు కల్పించింది. ఇక ఇతర దేశాల వారికి 90 రోజుల వ్యవధితో ఈ వీసా (e-visas) లను అందిస్తోంది. అలాగే ఆయా దేశాల వారికి ఈ వీసా ల ద్వారా మల్టీపుల్ ఎంట్రీలకు కూడా అవకాశం కల్పించింది. వియత్నం మాదిరిగానే థాయ్‌లాండ్ కూడా భారత్, తైవాన్ పర్యాటకులకు నవంబర్ 10వ తేదీ నుంచి వీసా ఫ్రీ ఎంట్రీకి వీలు కల్పించింది. 2024 మే 10వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. థాయ్‌లాండ్‌కు భారత్ నుంచి భారీ మొత్తంలో ప్రయాణీకులు వస్తుంటారని, అందుకే వీసా అవసరంలేని ప్రయాణ సౌకర్యం కల్పించింది.