
న్యూఢిల్లీ: ఇంట్లో లేదా హోటళ్లలో వాడిన తర్వాత పారవేసే వంట నూనెతో సస్టయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్‌ఏఎఫ్) తయారుచేయడానికి రెడీ అయ్యామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్ అర్విందర్ సింగ్ సహ్నీ అన్నారు. ఇందుకు సంబంధించి పానిపట్ రిఫైనరీకి అంతర్జాతీయ సర్టిఫికేషన్ లభించిందని చెప్పారు.
ఈ ఏడాది చివరినాటికి 35 వేల టన్నుల ఎస్‌ఏఎఫ్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని అన్నారు. ఎస్‌ఏఎఫ్ అనేది పెట్రోలియం కాని మూల పదార్థాల నుంచి తయారయ్యే ప్రత్యామ్నాయ ఇంధనం. దీనిని విమాన ఇంధనాల్లో కలిపి వాడొచ్చు. కార్బన్ ఎమిషన్ తగ్గుతుంది. ఎస్‌ఏఎఫ్‌ను 50శాతం వరకు సాధారణ జెట్ ఇంధనంతో కలపొచ్చు.
భారత్ 2027 నుంచి అంతర్జాతీయ విమానాలకు ఒక శాతం ఎస్‌ఏఎఫ్ కలపడాన్ని తప్పనిసరి చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, హల్దీరాం వంటి సంస్థల నుంచి వాడిన నూనెను ఏజెన్సీలు సేకరించి రిఫైనరీకి పంపిస్తాయని అర్విందర్ సింగ్ చెప్పారు.