
ప్రస్తుతం అమెరికాలోని భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దసరా, దీపావళికి స్వదేశం వచ్చి ఇక్కడి ఫ్యామిలీతో సరదాగా గడిపి మళ్లీ అమెరికాలోని తమ బిజీ జీవితాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న చాలా మంది వాటిని ప్రస్తుతం క్యాన్సిల్ చేసుకుంటున్నారు. పండగైనా, పబ్బమైనా, చావైనా, బతుకైనా అమెరికాలోని ఉండాలని డిసైడ్ అయిపోతున్నారు ట్రంప్ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచటంతో. ఈ క్రమంలో కొందరు ప్రయాణం మధ్యలోనే రద్దు చేసుకుని విమానాల నుంచి దిగిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వారి ఆందోళనలకు అద్దం పడుతున్నాయి.
పైగా అమెరికాలోని పెద్ద కంపెనీలు సైతం తమ హెచ్1బి ఉద్యోగులను యూఎస్ వదిలి వెళ్లొద్దంటూ ట్రావెల్ అడ్వైజరీ పాస్ చేయటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ బుక్ చేసుకున్న టికెట్లను కూడా రద్దు చేసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వారి ఫ్యామిలీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. దీంతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో భారీగా భారతీయ ప్రయాణికులు తమ ట్రావెల్ ప్లాన్స్ రద్దు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
అమెరికాను వదిలి ఇండియా వస్తే తమను తిరిగి వెనక్కి రానివ్వరనే భయాలు చాలా మందిని వెంటాడటంతో న్యూయార్క్, చికాగో, బే ఏరియా వంటి విమానాశ్రయాల వద్ద కూడా ప్యాసింజర్లు అకస్మాత్తుగా ట్రావెల్ రద్దు చేసుకోవటం కనిపించింది. చాలా నెలలుగా ఇంటికి వెళదాం అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ నాన్న ఇలా ఫ్యామిలీ మెుత్తంతో ఒక వారం గడిపి వద్దా అని కలలు కంటూ చేసిన ప్లాన్స్ ఇప్పుడు సేఫ్ కాదని వారు భావిస్తున్నారు. హెచ్1బి వీసా హోల్డర్లతో పాటు హెచ్4, ఎఫ్ 1 వీసా హోల్డర్లు కూడా ఇండియా రావాలంటేని భయపడిపోతున్నారు.
భారత ప్యాసింజర్లతో నిండిన విమానాల్లో ట్రంప్ ఫీజు పెంపు ఆందోళనలు చాలా మంది వెనక్కి తిరిగి వెళ్లేలా చేసింది. ఎమిరేట్స్ విమానంలో కూడా ప్యాసింజర్లు దిగిపోతాం అంటూ కోరటంతో గంటల తరబడి విమానాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎయిర్ లైన్ కంపెనీలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాయి. వాస్తవానికి సగటున ఇండియన్స్ ఏడాదికి 5 నుంచి 6 ట్రిప్స్ వేసేవారు కానీ ప్రస్తుతం అమెరికా చట్టాల్లో వస్తున్న కొత్త మార్పులతో ఇన్ సెక్యూరిటీ పెరిగిపోవటం వారిని ఉన్నచోటి నుంచి ప్రయాణం చేయకుండా అడ్డుకుంటోంది.