మన దేశం సేఫ్ కాదట

మన దేశం సేఫ్ కాదట

ఇండియన్లు శరణు.. శరణు.. అంటున్నారు. తమకు ‘ఆశ్రయం’ కల్పించాలంటూ విదేశాలను కోరుతున్నారు. ‘పొలిటికల్ అసైలం’ కోసం అర్జీలు పెట్టుకుంటున్నారు. ఇలా అసైలం కోరుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. పెరగడం అంటే అలా ఇలా కాదు. గత పదేళ్ల (2008 నుంచి 2018 వరకు)తో పోలిస్తే 996.33 శాతం ఎక్కువగా. ఇండియాలో తమకు డేంజర్ అని భావించి, ఇతర దేశాల్లో తల దాచుకునేందుకు వెళ్లిపోతున్నారు. ఇండియన్లు అసైలం కోరుతున్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉంది.

2018లో 51,769 మంది..

2009లో కేవలం 4,722 మంది ఇండియన్లు ఇతర దేశాల్లో పొలిటికల్ అసైలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే 2018లో ఈ సంఖ్య 51,769కు చేరుకుంది. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యూఎన్​హెచ్​సీఆర్) డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఈ పదేళ్లలో అమెరికా, కెనడా దేశాలకు ఇండియన్లు ఎక్కువగా వెళ్లారు. ఆ దేశాలు తమకు సేఫ్ అని భావించారు. 2009లో 1,321 మంది అమెరికాకు, 1039 మంది కెనడాకు వెళ్లారు. అదే 2018లో 28,489 మంది అమెరికాను, 5,522 మంది కెనడాను అసైలం కోరారు.

యెమెన్, సూడాన్​లకు కూడా..

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో తమకు పొలిటికల్​గా భద్రత ఉంటుందని ఎక్కువ మంది ఇండియన్లు అక్కడికి వెళ్లడం సహజమే. కానీ గమ్మత్తయిన విషయం ఏంటంటే.. యెమెన్, సూడాన్, బోస్నియా, బురుండి వంటి దేశాలను కూడా అసైలం కోరుతున్నారు. అక్కడ ఎప్పుడూ అంతర్గత యుద్ధాలు, అల్లర్లు, దాడులు జరుగుతూనే ఉంటాయి.

ఇండియాలో కొందరే..

ప్రపంచంలోనే అదిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు శరణార్థులుగా వచ్చే వారు చాలా తక్కువగా ఉన్నారు. యూఎన్​హెచ్​సీఆర్ రిపోర్టుల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా పొలిటికల్ అసైలం కోరిన వారు 35.03 లక్షల మంది వరకు ఉన్నారు. ఇందులో ఇండియాను అసైలం కోరిన వారు కేవలం 0.34 శాతం (11,957) ఉన్నారు. అత్యధికంగా అమెరికాలో అసైలం కోసం 7.18 లక్షల మంది, జర్మనీలో 3.69 లక్షల మంది, టర్కీలో 3.11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.